నోయిడా నివాసి నీతూ (ఫొటో కర్టెసీ : హిందుస్థాన్ టైమ్స్)
నోయిడా : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు నోయిడాకు చెందిన రాజ్, సర్వేశ్ సక్సేనా దంపతులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు రాజ్, సర్వేశ్‌లు చెప్పిన పోలికలతో కూడిన ఒక అమ్మాయి శవం దొరికింది. వెంటనే వారిద్దరినీ పిలిపించి శవాన్ని గుర్తించాల్సిందిగా కోరారు. ముఖం పూర్తిగా కాలిపోవడం.. శవం కాళ్లూ, చేతులు తమ కూతురు నీతూ లాగే ఉండటంతో ఆ శవం తమ కూతురిదే అనే నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆ శవాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అంతేకాకుండా తమ కూతురు చావుకు కారణం ఆమె భర్త రామ్ లక్ష్మణ్ అని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రామ్ లక్ష్మణ్‌ని, అతడి తండ్రిని విచారించిన పోలీసులకు వారు చెప్పింది నిజమనే అన్పించింది. దీంతో వారు మరో కోణంలో విచారణ మొదలుపెట్టారు. విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీతూ అసలు మరణించలేదని, ఆరోజు ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది వేరొకరి శవమని గుర్తించారు.
మరి నీతూ ఎక్కడుంది..!
భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న నీతూ(25) వారితో గొడవ కావడంతో ఏప్రిల్ 6న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నీతూ మరణించలేదని తెలుసుకున్న పోలీసులు ఆమెను వెదికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నీతూ తల్లిదండ్రులు నిర్వహిస్తున్న కూరగాయల దుకాణానికి తరచుగా వచ్చే వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ప్రవర్తనతో విసుగు చెందిన నీతూ.. తమ దుకాణానికి వచ్చే పూరన్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయమై నీతూ తల్లిదండ్రులు పూరన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరగా.. తన ఇష్టప్రకారమే అతడితో వెళ్లానని నీతూ చెప్పడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. దీంతో మే 2న నీతూను తీసుకువచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
ఎన్నో అనుమానాలు..
నీతూ ఆచూకీ ఎక్కడ, ఎప్పుడు లభించిందనే వివరాల గురించి పోలీసులు స్పష్టంగా తెలియజేయక పోవడం.. నీతూ తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించిన సమయంలో డీఎన్‌ఏ పరీక్ష చేయమని వారు కోరినప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే నీతూ విషయంలో ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు నీతూ తల్లిదండ్రులకు అప్పగించిన శవం ఎవరిదో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment