కోడెల శివప్రసాదరావుతో తనయుడు శివరాం
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
దౌర్జన్యాలను ప్రశ్నిస్తే దాడులే
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల శివరాం, విజయలక్ష్మి చెలరేగిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అప్పట్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో కోడెల శివప్రసాదరావు తన కుమారుడు, కుమార్తెకు సంపూర్ణంగా సహకరించారు. వారి ఇలాకాలో ల్యాండ్ కన్వర్షన్ జరగాలన్నా, అపార్టుమెంట్ నిర్మాణాలకు అనుమతులు రావాలన్నా కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్) చెల్లించాల్సిందే. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ ఎవరినీ వదల్లేదు. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగేవారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, బాధితులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసేవారు.
కోడెల కుటుంబంపై విచారణకు ‘సిట్’
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబం వల్ల నష్టపోయిన వారంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్‌లకు వెళ్లి, కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో కోడెల కుమారుడు, కుమార్తెలపై దాదాపు 10 కేసులు నమోదు కావడం గమనార్హం. కోడెల కుటుంబం చేసిన అన్యాయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. కోడెల కుటుంబంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.
రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు
నరసరావుపేట టౌన్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షల వసూలు చేసిన కోడెల శివరాం ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఆంధ్ర రంజీ జట్టు క్రీడాకారుడు బుడుమూరు నాగరాజు శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి బుడుమూరు నాగరాజు ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరాం పరిచయమయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఏఎల్‌పీ ఉద్యోగం ఇప్పిస్తానని శివరాం నమ్మబలికాడు. దాంతో నాగరాజు అతడికి 2018 ఫిబ్రవరి 27న రూ.15 లక్షలు సమర్పించుకున్నాడు. నాగరాజు నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక ధ్రువపత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌కు వెళ్లమని శివరాం చెపాడు. శివరాం చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్‌కు వెళ్లాడు. అక్కడ శివరాంకు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేప్పుడు నీకు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు వెనక్కి వచ్చేశాడు.
కోడెల కుటుంబంపై ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులు చూసి తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్‌లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2వ తేదీన నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అక్కడ నాగరాజుపై కోడెల అనుచరులు దాడి చేశారు. బలవంతంగా బాండ్ పేపరు లాక్కొని చించేశారు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు చెప్పడంతో శుక్రవారం డబ్బులు తిరిగి ఇస్తానని అతడిని నరసరావుపేటకు రప్పించారు. గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని నాగరాజుకు చెప్పారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నాగరాజు చివరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు.
శివప్రసాదరావు, శివరాంపై కేసు నమోదు
బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాంలపై చీటింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారీ, సెక్షన్ 420, 468, 472, 477, 387, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment