ఇంటిని తగలబెట్టిన దృశ్యం ,హత్యకు గురైన వెంకట్రామన్ (ఫైల్)
తిరువళ్లూరు: పాతకక్షల కారణంగా బెడ్‌రూంలో నిద్రిస్తున్న వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపిన సంఘటనతో తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామం ఉలిక్కిపడింది. ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామానికి చెందిన మాజీ అధ్యక్షుడు తంగరాజన్. ఇతను 2016, అక్టోబర్ 14న వాకింగ్‌కు వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తంగరాజన్ తమ్ముడు వెంకట్రామన్ (47) ఇంట్లో నిద్రిస్తుండగా రెండు బైక్‌లు, ఇండికా కారులో ముసుగుతో వచ్చిన ఆరుగురు వెంకట్రామన్ బెడ్‌రూంకు వెళ్లి నిద్రిస్తున్న అతన్ని దారుణంగా నరికి పరారయ్యారు.
కొన ఊపిరితో ఉన్న వెంకట్రామన్‌ను బంధువులు తిరువళ్లూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. దీనిపై మృతుడి తరఫు వర్గం వారు వెళ్లవేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ గంగాధరన్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో 17ఏళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన మనోహరన్‌ను తంగరాజ్ మద్దతుదారులు హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మనోహరన్ కుటుంబానికి, తంగరాజ్ కుటుంబానికి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే రెండేళ్ల కిందట తంగరాజన్‌ను, బుధవారం ఉదయం అతని తమ్ముడు వెంకట్రామన్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గ్రామంలో ఉద్రిక్తత..
వెంకట్రామన్ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య విషయం తెలసుకున్న వెంకట్రామన్ మద్దతుదారులు ఆగ్రహంతో గ్రామంలో బీభత్సం సృష్టించారు. మనోహరన్ మద్దతుదారులైన నలుగురి ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకో నిర్వహించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని సముదాయించి పరిస్థితిని అదుపుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment