మాట్లాడుతున్న సీఐ సురేందర్‌రెడ్డి
కల్వకుర్తి టౌన్: మగువపై మోజు ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్ బ్రిడ్జి కింద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు(76) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య గతేడాది జనవరిలో కన్నుమూసింది. అయితే, రామదాసుకు ఆడవారిపై మోజు ఉండగా వృద్ధాప్యంలో ఆలనాపాలనా, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ మహిళను ఎంచుకోవాలని ఆలోచించాడు.
తన ఇంట్లో వడ్రంగి పనులు చేసిన కపిలవాయి శ్రీరాములుతో మనసులో మాట చెప్పాడు. దుర్బుద్ధితో ఆలోచించిన శ్రీరాములు వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. కల్వకుర్తిలో ఓ మహిళ ఉందని చెప్పాడు. అబిడ్స్‌లో ఉన్న జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రామదాసుతో రూ.2 లక్షలు డ్రా చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి కల్వకుర్తికి చేరుకున్నారు. ఆటోలో నాగర్‌కర్నూల్ రోడ్డులో ఉన్న సుద్దకల్ గ్రామంలోని బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు.
కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి రామదాసు తల, ముఖంపై గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. రూ.2 లక్షలు తీసుకున్న శ్రీరాములు హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రామదాసు సెల్‌ఫోన్ కాల్ డేటా కోసం ఆరా తీయగా శ్రీరాములు పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటికే శ్రీరాములు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. తాజాగా శ్రీరాములు తన కూతురు వివాహ పత్రికలు పంచడానికి కల్వకుర్తికి రావటం.. సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రామదాసును హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment