
భైరిసారంగపురంలో గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, నిందితుడు రుషి
సాక్షి, మందస (శ్రీకాకుళం) : అభం శుభం తెలియని ఆ చిన్నారి(6)కి తాత వయసులో జోల పాటలతో మురిపించాల్సిన ఓ వృద్ధుడు తన పెద్దరికానికే మచ్చ తెచ్చాడు. చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకృత్యం తెలుసుకోలేని బాధిత బాలిక బాధను గుర్తించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోంపేట సీఐ కే శ్రీనివాసరావు, మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్ వివరాల మేరకు... మందస మండలం భైరిసారంగపురం గ్రామంలో బాధితురాలి తండ్రి ఓ టైలర్ వద్ద సహాయకునిగా, జీడిపిక్కల ఫ్యాక్టరీలో తల్లి కూలీగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.
వీరికి సమీపంలో నివాసముంటున్న గొరకల రుషి(62) ఈ నెల 18న చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో చాకెట్లు, బిస్కట్లు ఇస్తానని ఆశపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి బాధనకు తల్లికి చెప్పడంతో పలాసలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయట పడింది. చిన్నారి విషయం చెప్పడంతో కుటుంబం పరువు పోతుందని తొలుత భావించిన ఆ కుటుంబం చివరకు పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లింది. పెద్ద మనుషులు ప్రశ్నించగా నిందితుడు తప్పును అంగీకరించి, నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పెద్దల సూచన మేరకు మందస పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. సీఐ, ఎస్‌ఐలు బుధవారం గ్రామానికి చేరుకుని, పెద్దలతో చర్చించారు.
నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధిత చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం పలాస లేదా, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తామన్నారు. ఈ కేసు విచారణలో ఏఎస్‌ఐ రెల్ల కూర్మారావు, సోంపేట హెచ్‌సీ అరుణ్‌కుమార్, ఎం కోదండరావు, రామ్మోహనరావు, సూర్యనారాయణ, సంతోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రుషిపై పోక్సోచట్టం, ఐపీసీ 376 ఏ, బీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు సోంపేట సీఐ కే శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
లైంగిక దాడి కేసులో నిందితుడు రుషిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈయన గుడ్డిభద్రలో తన బంధువుల ఇంట్లో దాగున్నట్లు తెలిసింది. గురువారం కోర్టులో హాజరు పరిచే అవకాశమున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment