సాక్షి, చేబ్రోలు: దళిత నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఎమ్మార్పీఎస్ మాజీ నేత, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య హత్యకు ప్రధాన కారణమని చేబ్రోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలకేంద్రలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీ రాత్రి చేబ్రోలు మండల పరిధిలోని వేజండ్ల పల్లె అడ్డరోడ్డు దగ్గర అమృతలూరు ప్రాంతానికి చెందిన పమిడిపాటి కోటయ్య హత్యకు గురయ్యాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు, తెనాలి ఐతానగర్‌కు చెందిన కొత్తపల్లి నాగరాజు, కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర, కూచిపూడి మోహన్, సుద్దపల్లి కిషోర్‌లు కోటయ్య హత్యకు కారకులని వెల్లడించారు.
సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు పమిడిపాటి కోటయ్య, తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. కోటయ్యను ఎమ్మార్పీఎస్ నుంచి తొలగించిన తరువాత వీరిద్దరికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోటయ్య ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పీక కోస్తానని, చంపుతానని పోస్టులు పెట్టడంతో ఎక్కడ తనను చంపుతాడోనని భావించి ముందుగానే నాగరాజు కోటయ్యను చంపాలని నిర్ణయించుకొని మరి కొంత మంది సహకారంతో పథకం ప్రకారం హత్య చేశాడు. కోటయ్య కదలికలను గమనించి స్కార్పియాతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐతో పాటు స్థానిక ఎస్‌ఐ సీహెచ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment