
హెచ్‌ఎంతో వాగ్వాదం చేస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు
సాక్షి, రాయదుర్గం : విద్యార్థినుల పట్ల అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడి(పీఈటీ)కి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇలాహి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో కలిసి మంగళవారం పాఠశాల వద్దకు చేరుకున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌వారిస్ వారిని వారించి.. మాట్లాడదాం అని చెప్పి.. వ్యాయామ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక శిక్షణ పేరుతో వెకిలిచేష్టలు
పీఈటీ ఇలాహి ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తానని ప్రతి శుక్రవారం ఎనిమిదో తరగతి విద్యార్థినులను రప్పించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ పిల్లలు సోమవారం రాత్రి తమకు తెలిపారని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల గురించి పిల్లలు చెబుతుంటే తట్టుకోలేకపోయామన్నారు. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు వస్తే తమను చూసి తప్పించుకునేయత్నం చేసిన ఇలాహిని పట్టుకున్నామన్నారు. బాధిత విద్యార్థినులకు భరోసాగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌వారిస్ అసభ్యరంగా ప్రవర్తించిన పీఈటీని తప్పించి, వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం ఈ ఘటనపై మండల విద్యాధికారి నాగమణితో పాటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కఠినంగా శిక్షించాలి
పీఈటీ ఇలాహిని వెంటనే విధుల నుంచి తొలగించాలని వివిధ పాఠశాలల విద్యార్థినులతో కలిసి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు.
పీఈటీపై చర్యలు తీసుకోవాలి
ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అయిన జింకా వసుంధర డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి కీచకులు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment