
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పైరసీ బారినపడింది. న్యాచురల్ స్టార్ నానీ ‘ఎంసీఏ’ కూడా పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉంది. ఈ విషయమై అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాల నిర్మాతలు రాధాకృష్ణ, దిల్ రాజులు బుధవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు పెద్దసినిమాలు పైరసీ బారిన పడటంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. గతంలోనూ పవన్-త్రివిక్రమ్ కాబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు : ‘ఎంసీఏ’ పైరసీకారులపై ఫిర్యాదు చేసేందుకు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని దిల్ రాజు చెప్పారు. పైరసీల వల్ల దాదాపు ఇండస్ట్రీకి ఏటా వెయ్యికోట్ల మేర నష్టం జరుగుతోందని అంచనా. ప్రభుత్వానికి దాదాపు వందకోట్ల ఆదాయానికి గండిపడిందని విశ్లేషకుల అంచనా.