స్టేషన్‌కు పద..లేకుంటే సమర్పించాలె. ఎక్కడైన చెబితే మీ సంగతి ఫోన్‌లో ఉంది.. ఇక మీ ఇష్టం!
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పోలీసులను ఓ కుదుపు కుదిపిన కానిస్టేబుల్ వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. నగరంలోని యువతులు, మహిళలు, ప్రేమికులను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడిన వ్యక్తి సుబేదారి పోలీసు స్టేషన్‌లో పనిచేసే ఖత్రీ చంటిగా గుర్తించి అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ బండారు వెంకట్‌రెడ్డి తెలిపారు. సుమారు ఐదు రోజుల పాటు అంతర్గతంగా విచారణ చేసిన ఇంతేజార్‌గంజ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టును చూపారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రేమ జంటలను బెదరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో బంగారం, నగదు దోచుకున్న కానిస్టేబుల్ వ్యవహారం కమిషనరేట్ పరిధిలో హాట్ టాపిక్‌గా మారంది. దీంతో పోలీసు ఉన్నత అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కమిషనర్ విశ్వనాథ రవీందర్ అదేశాలతో నిష్పక్షపాతంగా విచారణ జరిగినట్లు సమాచారం. కొంత మంది బాధితుల ఫిర్యాదు మేరకు మడికొండలో రెండు, మిల్స్‌కాలనీలో ఒకటి, సుబేదారిలో ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి. కానిస్టేబుల్ దోపిడిలను ఈనెల 20న సాక్షి జిల్లా ఎడిషన్‌లో ’గలీజ్ పోలీసు’ పేరిట కథనం ప్రచురితం కావడం తెలిసిందే
చంటి అరెస్టు..
వరంగల్ పోలీసు కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ బండారు వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుబేదారి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఖత్రీ చంటి, పోలీసు శాఖలో 2013లో కానిస్టేబుల్‌గా చేరాడు. మహబుబాబాద్ జిల్లా ఇందిరనగర్‌కు చెందిన చంటి హంటర్‌రోడ్‌లో బీట్ డ్యూటీ నిర్వహిస్తూ.. నిర్మానుష్య ప్రాంతాలకు వచ్చే ప్రేమ జంటలపై దృష్టి సారించేవాడని ఆయన తెలిపారు. ప్రేమ జంటల ఫొటోలు తీసి, బంధువులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడి వారి నుంచి బంగారం, డబ్బులు దోచుకునే వాడని.. ఇదే క్రమంలో 2017లో హంటర్‌రోడ్‌లో ఓ కారులో ఉన్న ప్రేమ జంటను బెదరించి రూ.20వేలు దోచుకున్నాడన్నారు. మడికొండ ప్రాంతంలో సాయినాథ్ మెగా గ్రీన్ సిటీ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ప్రేమ జంటను బెదిరించి బంగారు గొలుసు, రూ.1500 దోచుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈనెల మొదటి వారంలో మడికొండ పీఎస్ పరిధిలో మెగా గ్రీన్ సిటీ ప్రాంతంలో ఒక జంటను బెదిరించి రూ.900, మిల్స్‌కాలనీ పరిధిలోని అమ్మవారిపేట క్రాస్‌రోడ్ ప్రాంతంలో కారులో వచ్చిన ప్రేమ జంటను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఉంగరం, ఒక గొలుసుతో పాటు రూ.19500 దోచుకున్నాడని డీసీపీ వెల్లడించారు.
కారు, బంగారం స్వాధీనం..
నిందితుడు కానిస్టేబుల్ చంటి నుంచి 70 గ్రాముల బంగారు అభరణాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.52 వేల నగదు స్వాదీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై ఫిర్యాదులు రావడంతో సీపీ డాక్టర్ రవీందర్ అదేశాల మేరకు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ నందిరాంనాయక్ రంగసముద్రం మత్తడి వద్ద తిరుగుతున్న నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుణ్ని విచారించగా నేరాలను ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుణ్ని అరెస్టు చేసి సొమ్మును రికవరీ చేసిన వరంగల్ ఏసీపీ ఆర్.ప్రభాకర్‌రావు, ఇన్‌స్పెక్టర్ నందిరాంనాయక్, సిబ్బందిని డీసీపీ వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment