సాక్షి, కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన రాధిక ఈ నెల 10న ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య కేసు మిస్టరీగా మారడంతో పోలీసులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. జర్మనీ టెక్నాలజీ ద్వారా క్లూస్ టీం సేకరించిన ఆధారాల ప్రకారం నిందితులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ సమాచారం.
హత్య జరిగిన ప్రదేశంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం వివిధ వస్తువులపై రక్తపు మరకలు గుర్తించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టులు రాగానే కేసుకు సంబంధించిన కీలకమైన విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థిని రక్తపు మరకల ఆధారంగా అనుమానాలు ఉన్న అతి సన్నిహితులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాలని అనుకున్నట్లు తెలిసింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే కేసు ముందకు సాగునుందని అర్థమవుతోంది.
కొత్త టెక్నాలజీ ద్వారానే..
విద్యార్థిని హత్య జరిగిన నాటి నుంచి గత రెండు రోజుల క్రితం వరకు ఇక్కడి ఫోరెన్సిక్ విభాగం సేకరించిన ఆధారాల ద్వారా నిందితుడికి సంబంధించిన ఆధారాలు ఏమీ తెలియరాలేదు. పోలీసులు హత్య జరిగిన నాటి నుంచి రాత్రింబవళ్లూ కష్టపడి శ్రమించినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఈ నెల 13న హైదరాబాద్ నుంచి క్రైంసీన్ ఆఫీసర్ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం ఆధ్వర్యంలో అత్యాధునిక జర్మనీ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్ కిట్స్ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
ప్రత్యేక ఫోరెన్సిక్ క్లూస్‌టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్‌రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వస్తువులు, బట్టలు, చెప్పులు, పలు వస్తువులను పరిశీలించారు. త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీసి నూతన టెక్నాలజీతో కావాలి్సన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. రక్తం పడ్డ ప్రదేశం కడిగినా, ఎంత శుభ్రం చేసినా రోజుల తర్వాత కూడా వాటిని పట్టేసే అత్యద్భుతమైన జర్మనీ టెక్నాలజీ ద్వారానే నిందితులను పట్టుకునే అవకాశాలున్నయని తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు రావడమే తరువాయి నిందితులను పట్టేయ్యవచ్చనే ధీమాతో పోలీసు వర్గాలున్నాయని సమాచారం.
అతి సన్నిహితులపై పోలీసుల దృష్టి..?
పోలీసులు రాధిక హత్య కేసుకు సంబంధించిన సన్నిహితులపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు 30 మందికిపైగా విచారించిన ఫలితం లేకుండా పోవడంతో అతి సన్నిహితులపై దృష్టి సారించినట్లు సమాచారం. అతి సన్నిహితుల్లో ఒకరిద్దరిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా వారిని కూడా త్వరలోనే విచారించి, ఫోరెన్సిక్ నివేదికల్లో కూడా వారి ప్రమేయం ఉన్నట్లు తెలితే చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇంతకీ పోలీసులు దృష్టి సారించిన సన్నిహిత వ్యక్తులు, ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించే నిజాలకు సరిపోలుతాయా లేదా అన్న విషయాలు బయటపడితే కానీ కేసు కొలిక్కి వచ్చేలా లేదని తెలుస్తోంది. ఒకవేళ నివేదిక వెల్లడించే నిజాల ప్రకారం పోలీసులు భావిస్తున్న వ్యక్తుల ప్రమేయం లేదని తేలితే పోలీసులు మళ్లీ కొత్త కోణంలో దర్యాప్తు కొనసాగించాలి్సందేనని తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే కేసు ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment