
గుంటూరు ఈస్ట్: తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిండు గర్భిణీని గుర్తు తెలియని వ్యక్తి జీజీహెచ్ కాన్పుల వార్డుకు తీసుకొచ్చాడు. ఓపి చీటి తెస్తానని వెళ్లి తిరిగిరాలేదు. ఈ క్రమంలో ఆ మహిళ మృతి చెందడంతో ఆమె వివరాలు తెలియక మృతదేహాన్ని వైద్యులు మార్చురీకి తరలించారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు విచారణ చేపట్టారు. అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం... సోమవారం గుర్తు తెలియని వ్యక్తి 35 సంవత్సరాల వయస్సు ఉన్న బుజ్జి అనే నిండు గర్భిణీని కాన్పుల వార్డుకు తీసుకువచ్చాడు.
ఆమెకు అధికంగా రక్త స్రావం అవుతుండటంతో వైద్యులు వెంటనే వార్డులో చేర్చుకున్నారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తిని ఓపి చీటి రాయించుకు రావాలని వైద్యులు కోరారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆ మహిళ తన పేరు బుజ్జి అని, వయస్సు 35 సంవత్సరాలు, తాను మారుతి నగర్‌లో నివసిస్తానని, ఇది 3వ కాన్పు అని చెప్పింది. కొద్దిసేపటికే బుజ్జి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. ఆమె సంబంధికులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అవుట్ పోస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టాభిపురం పోలీసులు మృతి చెందిన మహిళ వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. ఫొటోలోని మహిళను గుర్తించిన వారు : 8519835949 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment