
ప్రతికాత్మక చిత్రం
జైపూర్ : పోస్టింగ్ ఆర్డర్ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్ దౌసా జిల్లాకు చెందిన జగ్‌మోహన్ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్ మోహన్ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హలచల్ చేస్తోంది.
అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్‌మోహన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్ ఆర్డర్ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర కుమార్ జగ్‌మోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేంద్ర కుమార్ తెలిపారు.
జగ్‌మోహన్ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్ ఆర్డర్‌ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్ మోహన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment