సాక్షి, కళ్యాణదుర్గం (అనంతపురం) : వినాయక చవితి చందాల వసూళ్లు హద్దుమీరుతున్నాయి. యువకులు రోడ్లపైకి వచ్చి తాడు అడ్డు పెట్టి వాహనాలను ఆపి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో రోడ్డుపై దాదాపు 20 మంది యువకులు వారం రోజులుగా వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఆపబోయారు.
అప్పటికే అడుగడుగునా ఇలాంటి చందాల బ్రేకప్‌లతో విసుగు చెందిన డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న యువకులవైపు దూసుకెళ్లాడు. వారిలో ముగ్గురిని ఢీకొట్టి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యర్రంపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్, విష్ణు, వసంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment