సాక్షి, గుంటూరు: తెలతెలవారుతుండగా పొగమంచులో నుంచి ఆర్టీసీ బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఉత్సాహంగా ఆటోలో బడికి బయలుదేరిన నలుగురు విద్యార్థులతో పాటు ఓ ఆటోడ్రైవర్ జీవితాన్ని ఛిద్రం చేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ఏం జరిగిందో అర్థమయ్యేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రత్యేక తరగతులకని ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థులు కొద్దిసేపటికే రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయాని కంటే ముందే తరగతులు నిర్వహించడం వల్ల తమ పిల్లల్ని కోల్పోవాల్సి వచ్చిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురువారం ఉదయం గుంటూరు జిల్లాలో జరిగింది.
ప్రమాదం జరిగిందిలా..
ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన ఏడుగురు విద్యార్థులు మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఇంటెల్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. రోజూలాగే మార్నింగ్ క్లాస్‌ల(ప్రత్యేక తరగతులు)కు హాజరయ్యేందుకు గురువారం ఉదయం 6 గంటలకే ఆటోలో పేరేచర్లకు బయల్దేరారు. గుంటూరు–కర్నూలు రహదారిపై రేపూడి శివారులోని సిరి శ్రీనివాస కోల్డ్‌స్టోరేజీ వద్దకు వచ్చేసరికి దట్టంగా పొగమంచు అలముకోవడంతో.. పొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న విద్యార్థుల ఆటోను ఢీకొట్టింది.
ఆటో డ్రైవర్ గమనించేలోపే బస్సు వేగంగా ఢీకొని కొద్దిదూరం ఆటోను ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రేపూడి ధన్‌రాజు(28)తో పాటు విద్యార్థులు మున్నంగి కార్తీక్‌రెడ్డి(15), కనుమద్ది గాయత్రి(17), ఆళ్ళ రేణుక(15), పొట్లపల్లి శైలజ(15) తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన విద్యార్థులు ఆటో కింద తీవ్రగాయాలతో చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ సీఐ ప్రభాకర్, ఫిరంగిపురం ఎస్‌ఐ ఎం.ఆనందరావు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆటోను పైకి లేపి తీవ్ర గాయాలపాలైన విద్యార్థినులు పొట్లపల్లి లక్ష్మీభాను, పొట్లపల్లి వైష్ణవి, ఆలకుంట శిరీషను చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సుతో పాటు డ్రైవర్ నన్నపనేని వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment