పక్కా..సినీ ఫక్కీలో.. | Robber Case Revealed | Sakshi
Sakshi News home page

పక్కా..సినీ ఫక్కీలో..

Published Fri, Mar 23 2018 8:44 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robber Case Revealed - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్‌గంజ్‌ ఠాణా పరిధిలోని ప్రిన్స్‌ పేపర్‌ ట్రేడర్స్‌.. మార్చ్‌ 14 ఉదయం 10 గంటల ప్రాంతం...  అప్పుడే దుకాణం వద్దకు వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగినట్లు గుర్తించారు... సంస్థ మూడో అంతస్తులో రహస్యమైన ప్రాంతం నుంచి రూ.11 లక్షలు దొంగతనం జరిగింది... ఘటనాస్థలికి చేరుకున్న పోలీ సులకు నిందితులు కిందికి దిగడానికి వినియోగించిన తాడు తప్ప మరో ఆదారం లభించలేదు... అయినా చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులను అప్పుడే అరెస్టు చేసినా... గురువారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.రమేష్, సుల్తాన్‌బజా ర్‌ ఏసీపీ డాక్టర్‌ చేతనతో కలిసి సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. 

యజమానితో స్పర్థలు రావడంతో...
రాజస్థాన్, జాలోర్‌ జిల్లాకు చెందిన జగదీష్‌ గిరి బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. కొన్నాళ్లు అఫ్జల్‌గంజ్‌లోని ప్రిన్స్‌ పేపర్‌ ట్రేడర్స్‌లో సేల్స్‌మెన్‌గా పని చేశాడు. అయితే యజమానితో విబేధాల కారణంగా కొన్నాళ్ళ క్రితం పని మానేశాడు. యజమానిపై కక్షగట్టిన అతను ఆయనకు నష్టం కలిగించాలని భావించాడు. దుకాణ యజమాని సైతం నగరంలో లేనట్లు గుర్తించిన జగదీష్‌... క్రయవిక్రయాలకు సంబంధించిన నగదు మొత్తం కార్యాలయంలోనే ఉంటుందని తెలుసుకుని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను  10 రోజుల క్రితం తన స్వస్థలానికి వెళ్లి, అక్కడే ఉండే తన స్నేహితుడు ప్రవీణ్‌ సింగ్‌కు విషయం చెప్పి అతడినీ ఒప్పంచాడు. ఇద్దరూ కలిసి 13న నగరానికి చేరుకున్నారు. అదే రోజు దుకాణం పని చేస్తున్న సమయంలో అందులోకి ప్రవేశించిన జగదీష్‌ టెర్రస్‌పై దాక్కున్నాడు. వెళ్లూ తన వెంట ఓ తాడు, కొంకి పట్టుకువెళ్లాడు. అర్థరాత్రి దుకాణం వద్దకు చేరుకున్న ప్రవీణ్‌ సింగ్‌ ఈ విషయం జగదీష్‌కు సమాచారం అందించాడు. దీంతో మూడో అంతస్తులోకి ప్రవేశించిన జగదీష్‌ రహస్య ప్రదేశంలో దాచిన రూ.11 లక్షల నగదు బ్యాగ్‌లో సర్దుకుని కింద ఉన్న ప్రవీణ్‌ వద్దకు విసిరేసి... తాడుకు కొక్కెం కట్టి, ఓ పైపునకు బిగించడం ద్వారా కిందికు దిగాడు. అనంతరం ఇద్దరూ కలిసి తాము తలదాచుకున్న ప్రాంతానికి వెళ్ళిపోయి... 14వ తేదీ రాత్రి 10 గంటలకు రాజస్థాన్‌ వెళ్లేందుకు ఓ ప్రైవేట్‌ బస్సు ఎక్కారు. 

పాత జాబితా ఆరా తీయగా...
చోరీ విషయాన్ని 14న గుర్తించిన దుకాణం నిర్వాహకులు అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నేరం జరిగిన తీరును బట్టి అందులో పని చేస్తున్న ఉద్యోగి లేదా మాజీ ఉద్యోగి పాత్ర ఉండవచ్చునని అనుమానించారు. దీంతో ఇటీవల ఉద్యోగం మానేసిన వారి జాబితా సేకరించారు. వారి వివరాలను ఆరా తీయగా జగదీష్‌ పేరు వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితం తన స్వస్థలానికి వెళ్లిన అతగాడు 13న సిటీకి వచ్చాడని, అదే రోజు దుకాణం వద్ద కూడా కనిపించాడని ఉద్యోగులు తెలిపారు. ఆ మరుసటి రోజే తిరిగి వెళ్లిపోతున్నట్లు తమతో చెప్పాడనీ పేర్కొన్నారు. దీంతో ఇతడినే ప్రధాన అనుమానితుడిగా నిర్ణయించిన పోలీసులు 15న అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలోని ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఆరా తీయగా, జగదీష్‌ తనతో పాటు మరో వ్యక్తి కోసం రాజస్థాన్‌కు వెళ్ళేందుకు ఓ బస్సులో టిక్కెట్లు కొన్నాడని, వారు 14 రాత్రి 10 గంటలకే బస్సు ఎక్కారని గుర్తించారు. ఆ బస్సు డ్రైవర్‌ నెంబర్‌ సేకరించిన పోలీసులు ఇరువురూ అదే బస్సులోని 19, 20 నెంబర్ల సీట్లలో ఉన్నారని, బస్సు అప్పటికే గుజరాత్‌ చేరుకున్నట్లు తెలుసుకున్నారు. బస్సు అహ్మదాబాద్‌ జిల్లాలోని రమోల్‌ ఠాణా పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు నిందితులూ నిద్రిస్తున్నట్లు డ్రైవర్‌ ద్వారా తెలుసుకుని రమోల్‌ పోలీసులను అప్రమత్తం చేసిన అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అక్కడి టోల్‌గేట్‌ వద్ద ఇద్దరు నిందితుల్నీ పట్టుకునేలా చేశారు. హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లిన పోలీసులు నిందితులతో పాటు రికవరీ చేసిన రూ.10.63 లక్షల నగదును అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement