బీరువాను పరిశీలిస్తున్న పోలీస్ అధికారి
శ్రీకాకుళం, మందస: మందస మండలంలోని హరిపురంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకులో పని చేస్తున్న ఓ మేనేజర్ ఇంటిలో బంగారం, నగదు దొంగిలించిన అనంతరం మరోచోట దొంగతనానికి విఫలయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. హరిపురం గ్రామంలోని సాయికాలనీలో నివాసముంటున్న మామిడిపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ బంగారు వినోద్ సోమవారం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు, బీరువా తాళాలు బద్దలై ఉన్నాయి.
బీరువాలోని 7 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదు, పట్టువస్త్రాలు, వెండినగలు దొంగలు అపహరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దొంగలు అదే గ్రామంలో మరో ఇంటి తలుపులను బలవంతంగా తెరచి దొంగతనానికి విఫలయత్నం చేశారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో ఇంకో ఇంటిలో గునపాలను దొంగిలించారు. ఒకే రాత్రి మూడు, నాలుగు చోట్ల దొంగతనానికి యత్నించారు. ఈ సంఘటనలపై మందస ఎస్‌ఐ వి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన బ్యాంకు మేనేజర్ ఇంటిలో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానితులు సోమవారం రాత్రి ఈ ప్రాంతంలో తిరిగారని స్థానికులు చెబుతున్నారు. వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment