సాక్షి, విజయవాడ : నగరంలో ముసుగుదొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం గోడౌన్‌లోకి చొరబడి హల్‌చల్ చేశారు. గుమాస్తాపై దాడిచేసి కౌంటర్‌లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను అపహరించుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ సంఘటనతో బిజినెస్ హబ్‌గా పేరుగాంచిన పాతబస్తీ పరిధిలోని ఇస్లాంపేటలో కలకలం రేగింది. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి ఇస్లాంపేటలోని ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్‌లోకి అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడ ఉన్న గుమాస్తా పాండేని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. అతను ప్రతిఘటించడంతో కర్రలతో దాడిచేసి గాయపరిచారు. కౌంటర్‌లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను తీసుకొని పారిపోయారు. సమాచరం అందుకున్న గోడౌన్ యజమాని వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన గుమస్తా పాండేని ఆస్పత్రిలో చేర్పించి, కొత్తపేట పోలీసులకు పిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముసుగు దొంగలు ఎవరు? కౌంటర్‌లో డబ్బు రెడీగా ఉందనే విషయం వారికి ఎలా తెలిసింది? గుమాస్తా చెప్సే కథలో నిజమెంత? ఆ ముగ్గురికీ, గుమాస్తా పాండేకు లింకులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని డీసీపీ విజయరామారావు పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని సంఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై డీసీపీ మాట్లాడుతూ సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, దోపిడీకి ముందు నిందితులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించామని తెలిపారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు విచారణను వేగవంతం చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment