వేలకు వేలొస్తాయన్నారు.. కోట్లు కొట్టేశారు! | Rs 1,200 crores Financial crime in the name of Multi Level Marketing | Sakshi
Sakshi News home page

వేలకు వేలొస్తాయన్నారు.. కోట్లు కొట్టేశారు!

Published Sun, Sep 9 2018 12:55 AM | Last Updated on Sun, Sep 9 2018 4:40 PM

Rs 1,200 crores Financial crime in the name of Multi Level Marketing - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు, నిందితులు రాధేశ్యామ్, సురేందర్‌ సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘మీరు రూ.7,500 చెల్లిస్తే చాలు... రూ.2,500 ఫీజును మినహాయించి రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులిస్తాం. మీరు మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు’అంటూ దేశవ్యాప్తంగా లక్షల మందికి ఆశచూపి దాదాపు రూ.1,200 కోట్లకు టోకరా వేశాడు హరియాణాకు చెందిన రాధేశ్యామ్‌. 34 ఏళ్ల ఇతడు ఏడో తరగతి వరకే చదవడం గమనార్హం. రాధేశ్యామ్, అతడికి సహకరించిన సురేందర్‌ సింగ్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు గుర్గావ్‌లో పట్టుకొని శనివారం నగరానికి తీసుకొచ్చారు. ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఆరు బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.200 కోట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు.

ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాల విభాగం పర్యవేక్షిస్తున్న డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలసి కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. హరియాణా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన రాధేశ్యామ్, ఫతేబాద్‌ తహసీల్‌కు చెందిన సురేందర్‌ సింగ్, బన్సీలాల్‌కు గుడ్‌వే, రైట్‌ కనెక్ట్‌ మార్కెటింగ్‌ సంస్థల్లో పనిచేసినప్పుడు పరిచయం ఏర్పడింది. అక్కడ నేర్చుకున్న మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ అనుభవంతో స్వతహాగా ముగ్గురూ కలసి 2015లో ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీని ప్రారంభించారు. హరియాణాలోని హిస్సార్‌ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించారు.  

ఉత్తర భారతీయులే లక్ష్యంగా... 
నెలకు రూ.20 వేల నుంచి రూ.పది లక్షల వరకు సంపాదించవచ్చు.. కేవలం రూ.7,500తో ‘ఫ్యూచర్‌ మేకర్‌’గా మారవచ్చని అన్ని పత్రికల్లో క్లాసిఫైడ్స్‌ ఇచ్చారు. 2015–2017 నవంబర్‌ వరకు కేవలం వేల సంఖ్యలో ఉన్న కస్టమర్ల సంఖ్య.. గత పది నెలల్లోనే ఏకంగా 20 లక్షల వరకు దాటింది. సెప్టెంబర్‌ 2న కంపెనీ చీఫ్‌ రాధేశ్యామ్‌ జన్మదినం సందర్భంగా ‘మాన్‌సూన్‌ బొనాంజా’అంటూ ప్రకటనలు బాగా ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వీరిని అరెస్టు చేసిన శుక్రవారం ఒక్కరోజే.. కంపెనీ పేరు మీదున్న బ్యాంక్‌ ఖాతాలకు రూ.75 కోట్లు వచ్చి చేరాయి.

ట్రస్టు పేరుతోనూ సేవా కార్యక్రమాలు చేసిన వీరు ముఖ్యంగా ఉత్తర భారతీయులపై గురిపెట్టారు. హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులు, గృహిణులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పార్ట్‌టైమ్‌ ఆదాయం పేరిట కుచ్చుటోపీ పెట్టారు. గత 6 నెలల నుంచి రాష్ట్రంలో ఊపందుకున్న ఈ వ్యాపారంలో దాదాపు రూ.29 కోట్లు మోసపోయారని సైబరాబాద్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. దీన్ని ఆర్థిక నేరాల విభాగం తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందం గుర్గావ్‌ వెళ్లి రాధేశ్యామ్, సురేందర్‌ సింగ్‌ను పట్టుకుంది. మరో నిందితుడు బన్సీలాల్‌ పరారయ్యాడు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.  

ఎంత మందిని చేరిస్తే అన్ని డబ్బులు... 
దుస్తులు, ఆరోగ్యకర ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ గొలుసు వ్యాపారం సాగుతున్నట్లుగా కనిపించినా  సభ్యుల చేరికపైనే సంస్థ నిర్వాహకులు ప్రధాన దృష్టి సారించారు. ఒక్కొక్కరూ ఇద్దరిని చేర్పిస్తే, ఆ ఇద్దరు మరో నలుగురు, ఆ నలుగురు మరో ఎనిమిది మందిని... ఇలా గొలుసుకట్టుగా సభ్యులను చేర్పించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎక్కువ సభ్యులను చేర్పించేలా ప్రోత్సహించేందుకు టైటిల్‌ కూడా ప్రదానం చేసేవారు. 10 మందిని చేర్పిస్తే స్టార్‌ టైటిల్‌ ఇవ్వడంతో పాటు రూ.5వేలు ఇచ్చేవారు. ఇలా సిల్వర్‌ స్టార్‌ (30 మంది), పెరల్‌ స్టార్‌ (80 మంది), గోల్డ్‌ స్టార్‌ (180 మం ది), ఎమరాల్డ్‌ స్టార్‌ (430 మంది), ప్లాటినమ్‌ స్టార్‌ (1,43 0 మంది), డైమండ్‌ స్టార్‌ (4,430 మంది), రాయల్‌ డైమండ్‌ స్టార్‌ (11,930 మంది), క్రోన్‌ డైమండ్‌ స్టార్‌ (26,930 మంది), క్రోన్‌ అంబాసిడర్‌ స్టార్‌ (61,930 మంది) టైటిల్‌ దక్కించుకున్నవాళ్లకు రూ.8 వేల నుంచి రూ.కోటి వరకు ఇస్తామంటూ భారీ మొత్తంలో సభ్యులను చేర్పించేలా స్కెచ్‌ వేశారు. ఇలా దాదాపు రూ.1,200 కోట్ల మోసపూరిత వ్యాపార లావాదేవీలు చేశారు. వీరిచ్చే ఆరోగ్యకర ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపడంతో అవి నకిలీవని తేలింది. ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ శ్రీనివాస్, ఆర్థిక నేరాల విభాగ బృంద సభ్యులు సుధీర్, ఆనంద్‌రెడ్డి, గోపీనాథ్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్యామ్, కూకట్‌పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ను సీపీ ప్రశంసించారు.  

చేరినా.. చేర్పించినా నేరమే
‘సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం)లో పెట్టుబడులు పెట్టినా, పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ బ్యానింగ్‌ యాక్ట్‌ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించుకోవడం అంటూ పత్రికల్లో వచ్చే క్లాసిఫైడ్స్‌ను నమ్మకండి. మీడియా కూడా ఇటువంటి ప్రకటనల విషయాల్లో ఆయా సంస్థలను అది ఎలా సాధ్యమనే వివరాలు తెలుసుకోవాలి. పోయింది చిన్న మొత్తం కాబట్టి పోలీసు స్టేషన్‌కు పోవాలా అని ఆలోచన చేస్తున్నారు. ఈ చిన్నచిన్నవి మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించొచ్చని ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి’అని సీపీ సజ్జనార్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement