ఘటనా స్థలంలోని దృశ్యం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. ఘటనా స్థలం భీతావహంగా ఉంది.
గాయపడిన వారు బస్సులో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు మృతులను అధికారులు గుర్తించారు. గీసుకొండకు చెందిన అయిలేని నాగరాజు, ముషీరాబాద్‌కు చెందిన జహీర్ హుస్సేన్‌లుగా తేలింది.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. చెంజర్ల ప్రమాదం గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమాద సంఘటన స్థలానికి చేరిన మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించిన ఆయన.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment