తొక్కిసలాట జరిగిన ప్రదేశం
ఆలయ ఉత్సవాల్లో ‘కాసుల’ కోసం ఎగబడ్డ భక్తులపై మృత్యువు పంజా విసిరింది. తొక్కిసలాటలో గాయాలతో, ఊపిరాడక ఏడుగురు మృతిచెందారు. మరో పదిహేను మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తిరుచ్చి తురయూరు వండితురై కరుప్పుస్వామి ఆలయ పరిసరాలు శోకసంద్రంలో మునిగాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు..
సాక్షి, చెన్నై: తిరుచ్చి జిల్లా తురయూరు సమీపంలోని ముత్తయం పాళయంలో వండితురై కరుప్పుస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా చిత్తిరై, చిత్రా పౌర్ణమి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడ ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను చాటే రీతిలో ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున భక్తులకు పిడి కాసుల్ని ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటే మహలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే. సిరి సంపదలు పెరుగుతాయన్నది భక్తులకు నమ్మకం. అలాగే, ఇక్కడ చెప్పే సోది తప్పకుండా ఫలిస్తుందని భక్తులు చెబుతుంటారు. అందుకే ఇక్కడి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా శనివారం సోది చెప్పే కార్యక్రమం జరిగింది. ఆదివారం పిడికాసుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కాసుల్ని వరంగా, కానుకగా తీసుకునేందుకు వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. పదిహేను జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివచ్చారు. కరుప్పుస్వామికి పూజల అనంతరం భక్తులకు పిడి కాసులు(పిడికిలి నిండా చిల్లర)పంపిణీకి పూజారి ధనపాల్ సిద్ధం అయ్యారు. తొలుత భక్తులు అందరూ బారులు తీరి మరీ కాసుల్ని అందుకుంటూ వచ్చారు.
హఠాత్తుగా తొక్కిసలాట ..
సజావుగా పంపిణీ సాగుతున్న సమయంలో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. కాసు ల పంపిణి ముగియనున్నట్టుగా ప్రచారం సాగడంతో, ఉన్న కాసుల్ని దక్కించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో తొపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని రక్షించే ప్రయత్నం కూడా చేయకుండా, వెనుక ఉన్న వాళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగారు. క్రమంగా తొక్కిసలాట పెరగడంతో ఆ పరిసరాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కింద పడ్డ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై కాసుల పంపిణీ నిలుపుదల చేయించారు. భక్తుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. బలవంతంగా అక్కడున్న వాళ్లందర్నీ బయటకు పంపించారు. అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఏడుగురు బలి
తొక్కిసలాటలో ఏడుగురు సంఘటన స్థలంలోనే మరణించడం విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న బలగాలు, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు పరుగులు తీశాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన తురయూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఐజీ వరదరాజులు, కలెక్టర్ సెల్వరాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతులందర్నీ ఆసుపత్రికి తరలించినానంతరం, మృతుల వివరాలను సేకరించారు. మృతుల్లో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38). పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నామక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52)గా గుర్తించారు. పదిహేను మంది గాయపడ్డట్టు తేల్చారు. ఆ ఏడుగురు తొక్కిసలాటలో గాయపడి, ఊపిరి ఆడక మరణించినట్టు విచారణలో తేలింది. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా, తమ వాళ్లు మరణించిన సమాచారంతో ఆప్తులు, బంధువులు ఆలయం వద్దకు తరలి రావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి. ఆలయ నిర్వాహకుడు, పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడమే కాదు, పెద్ద ఎత్తున కానుకలు, విరాళాల్ని నిర్వాహకుడు స్వీకరిస్తూ వచ్చినట్టు విచారణలో తేలింది.
మృతులకు సీఎం సాయం.....
తిరుచ్చి తురయూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబానికి సీఎం పళనిస్వామి సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబా లకు సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష చొప్పున ప్రకటించారు. అలాగే, గాయపడ్డ వారిలో 12 మందికి తలా రూ. 50 వేలు సాయం ప్రకటించారు. కేంద్రప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment