సాక్షి, గుంటూరు : గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న ప్యాసింజర్ రైలులో శనివారం షార్ట్ సర్క్యూట్ అయింది. రైలు బోగీలన్నింటికి విద్యుత్ సరఫరా అయిన ఘటనలో పలువురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ రైలు గుంటూరు నుంచి తెనాలి మీదగా ఒంగోలు వెళుతోంది. ఈ ఉదయం పదిగంటల సమయంలో వేజెండ్ల వద్ద రైలు ఆగగా కొంతమంది ప్రయాణికులు రైలు దిగడానికి తలుపుకు ఇరువైపులా ఉండే ఇనుప చువ్వలను పట్టుకున్నారు. దీంతో వారికి ఒక్కసారిగా షాక్ కొట్టింది.
అంతేకాకుండా వారి వెనకాల ఉండేవారికి కూడా కరెంట్ పాసయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రయాణికులు భయంతో ఫ్లాట్ ఫాం మీదకు దూకేశారు. అయితే నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ ఫాం కావడంతో పలువురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. రైలులో సాంకేతిక లోపం కారణంగానే షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment