కోల్డ్ స్టోరేజీ నుంచి భారీఎత్తున వస్తున్న పొగలు
సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) : నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామ సమీపంలోని శ్రీ చక్ర కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అందులో ఉన్న వ్యవసాయోత్పత్తులు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.5 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. తహసీల్దార్ హసీనా సుల్తానా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన రమేష్ అనే వ్యక్తి శ్రీచక్ర కోల్డ్ స్టోరేజీని కొత్తగా నిర్మించారు. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో రమేష్‌తో పాటు మరో ఐదుగురికి చెందిన వ్యవసాయోత్పత్తులు నిల్వ చేశారు. ఎండు మిర్చి 25 టన్నులు, కందులు 25 టన్నులు, శనగలు 50 టన్నుల వరకు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే..కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న కూలీలు గమనించి 10 బొల్లవరం గ్రామస్తులకు తెలియజేశారు. వారు కర్నూలులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే..భారీఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో రాత్రి ఎనిమిది గంటల సమయానికి గానీ అదుపులోకి రాలేదు. మొత్తం నాలుగు ఫైరింజన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో వ్యవసాయోత్పత్తులన్నీ కాలి బూడిదయ్యాయి. కోల్డ్ స్టోరేజీ కూడా దెబ్బతింది. రూ.5 కోట్ల దాకా నష్టం జరిగినట్లు యాజమాని రమేష్ ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుధాకరరెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో పవిత్ర తదితరులు పరిశీలించారు. కాగా..ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కోసమే ఇలా చేసి ఉంటారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment