సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్ ద్వారా పరిచయమైన కర్నూలు మహిళ కోసం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి, గత నెలలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చిక్కిన గుల్జార్ ఖాన్ పాకిస్థానీ అని అధికారికంగా నిర్ధారించడానికి పోలీసు విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడానికి సన్నాహాలు చేస్తోంది. గుల్జార్ వ్యవహారంపై పాకిస్థాన్ నుంచి వచ్చే సమాధానం ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావెన్సీలో ఉన్న కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ ఆర్థికంగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వాడు. ఇతడు 2004లో కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో నివసించాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచ్చిన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. ఈ కాల్‌ను కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌలత్‌బీ భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరి నడుమ ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న గుల్జార్ 2008లో సౌదీ మీదుగా ఇక్కడకు చేరుకున్నాడు. ఇన్నేళ్లు తన భార్యాపిల్లలతో కలిసి గడివేములలో నివసించిన గుల్జార్‌కు కొన్నాళ్ల క్రితం టీబీ వ్యాధి సోకింది. దీంతో పెయింటింగ్ పని చేయలేకపోతున్న ఇతగాడు తన స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్నాడు. దీనికోసం తనతో పాటు భార్య, పిల్లలకు విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్స్ పొందాడు.
పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపాడు. పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ చేయడానికి కర్నూలు నుంచి రైలులో గత నెల్లో సిట్ పోలీసులకు చిక్కాడు. సిట్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు గడివేముల చిరునామాతో తీసుకున్న ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలతో పాటు పాస్‌పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క ఇతడు సౌదీలో ఉండగానే తన పాకిస్థానీ గుర్తింపుల్ని ధ్వంసం చేసి హరిద్వార్ నుంచి హజ్ యాత్ర వచ్చి పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానంటూ భారత్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు. గుల్జార్‌ను భారతీయుడిగానే భావించిన ఆ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసి ఇక్కడకు పంపారు. ఈ నేపథ్యంలో గల్జార్ గడివేముల నుంచి తీసుకున్న గుర్తింపుకార్డులు అక్రమం అని నిర్ధారించాలంటే తొలుత అతడు పాకిస్థానీ అని తేల్చాల్సి ఉంటుంది. వాస్తవానికి గుల్జార్ కొన్నాళ్ల పాటు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్, సౌదీల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని పాక్ ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం, అతడు ఇక్కడ నివసించడం అక్రమం అనేది నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో సిట్ పోలీసులు ఎంహెచ్‌ఏ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్‌కు (ఎంఈఏ) లేఖ రాస్తున్నారు. ఇది ఎంఈఏ నుంచి పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత గుల్జార్ తమ పౌరుడు కాదంటూ పాక్ జవాబు ఇస్తే... అసలు ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమాధానం వచ్చిన తర్వాతే కేసులో ఎలా ముందుకు వెళ్ళాలన్నది నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment