కాల్‌డేటాపైనే కన్ను! | SIT Team Investigates On top-100 calls Of Srinivas Rao | Sakshi
Sakshi News home page

కాల్‌డేటాపైనే కన్ను!

Published Tue, Oct 30 2018 5:02 AM | Last Updated on Tue, Oct 30 2018 5:02 AM

SIT Team Investigates On top-100 calls Of Srinivas Rao - Sakshi

ముమ్మిడివరం గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న సిట్‌ అధికారులు

సాక్షి, విశాఖపట్నం/ముమ్మిడివరం (తూర్పుగోదావరి):  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కాల్‌డేటాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దృష్టి పెట్టింది. ఎక్కువ కాల్స్‌ స్వీకరించిన వారు గుంటూరు, హైదరాబాద్‌లలో ఉన్నట్లు గుర్తించిన ‘సిట్‌’ అధికారులు.. అక్కడికి రెండు ప్రత్యేక బృందాలను సోమవారం పంపించారు. విచారణలో కీలకంగా భావిస్తున్న కాల్‌ డేటాను విశ్లేషించేందుకు సిట్‌ ఇన్‌చార్జి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డీసీపీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఈ బృందాలను రంగంలోకి దించారు.

ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో చేరినప్పటి నుంచి తొమ్మిది సెల్‌ ఫోన్లు మార్చినట్టు గుర్తించిన అధికారులు ఇప్పటికే నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాటిని వాడుతున్న వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. కాగా, గడిచిన 10 నెలల్లో అతను ఏ నెంబర్లు వాడాడో తెలుసుకున్నారు. ఆయా నెట్‌వర్క్‌ల నుంచి ఎవరెవరితో ఎన్నిసార్లు, ఎంతసేపు మాట్లాడాడో కాల్‌డేటా తెప్పించారు. దాని ఆధారంగా శ్రీనివాసరావు నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చిన వందమందిపై దృష్టి పెట్టారు. వీరు  హైదరాబాద్, గుంటూరుల్లో ఉన్నట్టు  గుర్తించారు. అంతేకాకుండా, కాల్‌డేటాలో స్థానికంగా ఉన్న వారిని కూడా అధికారులు విచారించే పనిలో పడ్డారు. 

నాలుగో రోజూ కొనసాగిన విచారణ  
కాగా, ‘సిట్‌’ అధికారులు వరుసగా నాలుగో రోజైన సోమవారం కూడా ముమ్మిడివరంలో విచారణ జరిపారు. ఠాణేలంకలో శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావు, సావిత్రితోపాటు సోదరుడు సుబ్బరాజులతో మాట్లాడి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. ఇటీవల గ్రామంలో శ్రీనివాసరావు ఇచ్చిన విందులో పాల్గొన్న పలువురు యువకులను కూడా విచారించారు. శ్రీనివాసరావుకు అంత్యంత సన్నిహితంగా ఉండే మెల్లంరాజు, పులిదిండి దుర్గా ప్రసాద్, మెల్లం ప్రభాకర్, మద్దెల ప్రసాద్‌రావులను ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముమ్మిడివరం గృహనిర్మాణ శాఖ డీఈ కార్యాలయంలోనూ రికార్డులను పరిశీలించారు. నిందితుడు శ్రీనివాసరావు తండ్రి తాతారావు పేరిట పీఎంఆర్‌వై ఇల్లు మంజూరు కాగా.. అందుకు రూ.85 వేలు బిల్లులు చెల్లించినట్లు రికార్డులలో చూపించారు. అలాగే.. సుబ్బరాజు పేరిట కూడా పీఎంఏవై  ఇల్లు మంజూరైంది. 

అలాగే, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి నిందితుడు శ్రీనివాసరావుకు, సోదరుడు సుబ్బరాజుకు రెండు రుణ యూనిట్లను మంజూరు చేయించేందుకు టీడీపీ నేతలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కిరణా షాపు కింద రూ.2 లక్షల యూనిట్‌ కోసం శ్రీనివాసరావుతో.. సెంటరింగ్‌/రూఫ్‌ మేకింగ్‌ కింద రూ.లక్షా 50 వేల యూనిట్‌ కోసం సుబ్బరాజుతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. 

అకౌంట్ల వివరాలు పరిశీలన 
ఇదిలా ఉంటే.. నిందితుడు శ్రీనివాసరావుకు విశాఖలోని విజయా బ్యాంకుతో పాటు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు గుర్తించిన ‘సిట్‌’ అధికారులు వాటిల్లో ఏ మేరకు డబ్బులున్నాయో సోమవారం పరిశీలించారు. గత ఏడాదిగా ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీల వివరాలనూ సేకరిస్తున్నారు. అంతేకాక.. నిందితుడి కుటుంబ సభ్యులు, గ్రామంలోని స్నేహితుల ఖాతాలపై కూడా దృష్టి పెట్టారు. నిందితుని ఖాతా నుంచి వారికి పెద్ద మొత్తంలో ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా? లేదా? అన్న దానిపై దృష్టి పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement