సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మరోసారి పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు కన్పించడం లేదు. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితుడికి తొలుత 14 రోజులపాటు రిమాండ్ విధిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత కేసు తీవ్రతను బట్టి రిమాండ్‌ను పొడిగిస్తారు. కనీసం 90 రోజులపాటు రిమాండ్‌లో ఉంచే అవకాశం ఉంటుంది.
ఎంత పెద్ద కేసులోనైనా నిందితుడిని తొలి రిమాండ్ గడువు మీరకుండా పోలీస్ కస్టడీకి ఇస్తుంటారు. 14 రోజుల రిమాండ్ కాలంలో నిందితుడిని ఎన్నిసార్లయినా జ్యుడీషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి అప్పగించే అవకాశాలుంటాయి. ఆ తర్వాత రెండో రిమాండ్ సమయంలో మాత్రం పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతమాత్రం ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావును ఇప్పటికే ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. కస్టడీ గడువు ముగియగానే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, తిరిగి రిమాండ్‌కు తరలించారు.
పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
నిందితుడు పూర్తిస్థాయిలో సహకరించని కారణంగా విచారణలో నిజాలను రాబట్టలేకపోయామని, మరో వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ‘సిట్’ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసు కస్టడీ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చే సమయంలో హడావుడిగా పిటిషన్ దాఖలు చేయడం వల్లే తోసిపుచ్చిందని న్యాయ నిపుణులు అంటున్నారు. మరో పిటిషన్ దాఖలు చేసినా దాన్ని కోర్టు పెండింగ్‌లో ఉంచింది. మరోవైపు నిందితుడి రిమాండ్ గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనుండడంతో మరోసారి పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. నిందితుడిని మూడో మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో శుక్రవారం హాజరుపర్చనున్నారు.
మరో 14 రోజులపాటు రిమాండ్‌ను పొడిగించే అవకాశాలున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మొదటి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కమ్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనున్నట్లు సమాచారం. మానసిక వైద్యాలయం నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని జైలుకు పంపి, నిందితుడు శ్రీనివాసరావకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ నిందితుడి తరపున నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం గురువారం కోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయం తీసుకుంటారని అబ్దుల్ సలీం చెప్పారు.
సాక్షులకు నోటీసులు!
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. కానీ విచారణ సాగుతున్న తీరును నిరసిస్తూ సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు నిరాకరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు తమకు అభ్యంతరం వారు తేల్చిచెప్పారు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలోనే వాంగ్మూలం రికార్డు చేయడానికి వీలుగా సీఆర్‌పీసీ 164 కింద నోటీసులు జారీ చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సిట్ అధికారులు పేర్కొంటున్నారు.
పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
నిందితుడు గతంలో పని చేసిన హైదరాబాద్, బళ్లారి, బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించారు. కస్టడీ పొడిగింపును కోర్టు నిరాకరించినప్పటికీ ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేని రీతిలో అన్ని కోణాల్లో దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తామని సిట్ అధికారి బీవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు.
ఇక పోలీస్ కస్టడీ లేనట్టే!
Published Fri, Nov 9 2018 4:29 AM | Last Updated on Fri, Nov 9 2018 9:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment