సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును మరో వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో పిటిషన్‌ను వేసింది. హత్యాయత్నం జరిగిన తరువాత ఆరు రోజుల పాటు తమ కస్టడీలో చెప్పుకోతగ్గ విషయాలను రాబట్టలేకపోయామని భావిస్తున్న సిట్ అధికారులు శ్రీనివాసరావును మరోసారి విచారించాలని నిర్ణయించారు. శనివారం కస్టడీ ముగియగానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చే సమయంలో కస్టడీ పొడిగింపు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో సిట్ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు దీపావళి తర్వాత రెండు మూడురోజుల్లో విచారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
పక్కాగానే హత్యాయత్నం
నిందితుడు శ్రీనివాసరావు కొన్ని నెలలుగా పక్కా ప్రణాళిక వేసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టాడని సిట్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ముందుగా ప్రచారంలోకి వచ్చినట్టు అతనికి ఎలాంటి మానసిక వైకల్యం లేదని, పూర్తి ఆరోగ్యవంతుడని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆరురోజుల పాటు కస్టడీ సమయంలో వివిధ కోణాల్లో విచారించిన విషయాలను పరిశీలించగా.. శ్రీనివాసరావు చెప్పిన విషయాలన్నీ ముందే తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే చెప్పినవని పోలీసులు గుర్తించారు. సాధారణ నేరస్తులు కస్టడీలో కొన్ని అంశాలపై పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికిపోతారు. కానీ పక్కా కరుడుగట్టిన, కిరాయి హంతకులే ఇంత పక్కాగా కస్టడీ విచారణలోనూ పోలీసులను పక్కదారి పట్టించగలరని చెబుతున్నారు. శ్రీనివాసరావు తీరు కూడా అదే విధంగా ఉండడం సాధారణ విషయంకాదని ఓ ఉన్నతాధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు.
శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయవాది అబ్దుల్ సలీం విశాఖ 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అభ్యర్థిస్తూ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లాలని సూచించారు. న్యాయవాది సలీం నిందితుడు శ్రీనివాస్‌ను శనివారం జైలులో ములాఖత్‌లో కలిశారు.
నిందితుడి ఆరోగ్యం బాగుందన్న వైద్యులు..
నిందితుడు శ్రీనివాస్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేజీహెచ్ వైద్యులు కస్టడీ సమయంలో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించి నిర్ధారించారు. కస్టడీలోకి తీసుకున్న మూడో రోజు గుండెలో నొప్పిగా ఉందని నిందితుడు పేర్కొనడంతో తొలుత ప్రైవేట్ వైద్యుడితో స్టేషన్‌లో పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం కేజీహెచ్‌కు తరలించి బీపీ, షుగర్, పల్స్ కార్డియాక్ పరీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత రోజూ కేజీహెచ్ వైద్యుల్ని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన ప్రతిసారీ నిందితుడు శ్రీనివాస్ నూటికి నూరు శాతం ఫిట్‌గా ఉన్నాడని, అతడి మానసిక పరిస్థితి కూడా బాగుందని వైద్యులు మీడియా ఎదుటే చెప్పారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరు పర్చే సమయంలో కూడా నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడంటూ కేజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. నిందితుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అతడికి మతిస్థిమితం లేదని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మానసికంగా ధృఢంగా ఉన్నాడని, ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా చెబుతున్నాడని విచారణాధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, మానసిక వైద్యులతో పరీక్షించాలంటూ సీఆర్‌పీసీ 65ఏ కింద పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
సామాజిక బాధ్యతతోనే పిటిషన్ వేశా..
‘సామాజిక బాధ్యతతోనే ఉచితంగా ఈ కేసులో వాదించాలని నిర్ణయించుకున్నా. నన్ను బయటకు తీసుకురావద్దు. జైలులోనే ఉంటా. ఇక్కడే బాగుంటుందని నిందితుడు చెప్పాడు. అయితే బెయిల్ కోసం ఒప్పించి నిందితుడి అనుమతితోనే పిటిషన్ వేశా. అతడి కుటుంబ సభ్యులతోనూ ఫోన్‌లో మాట్లాడా.’
– అబ్దుల్ సలీం, న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment