రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు , నకులన్
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో ఆరేళ్ల బాలుడు హత్యకు గురి అయ్యాడు. హత్యకు గల కారణాల అన్వేషనలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు.
తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని ఎట్టయాపురానికి చెందిన జయశంకర్ కుమారుడు నకులన్(6) ఇంటి ముందు ఆడుకుంటుండగా సోమవారం అదృశ్యం అయ్యాడు. బాలుడి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడ్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారన్న ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎక్కడా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. బాలుడి కోసం గ్రామస్తులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదళ్లల్లో బాలుడి మృత దేహం బయట పడింది. గొంతు నులిమి బాలుడ్ని హత్య చేసి ఉన్నట్టుగా తేలింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ఆస్పత్రికి తరలించారు.
కాగా బాలుడ్ని కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుల్ని అరెస్టు చేయాలని కోరుతూ బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులు రోడ్డెక్కారు. తూత్తుకుడి – మదురై జాతీయ రహదారిలో బైటాయించారు. దీంతో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు గ్రామస్తుల్ని బుజ్జగించారు. విచారణను ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో అదే గ్రామానికి చెందిన అమల్ రాజ్ ఈహత్య చేసినట్టుగా ఇద్దరు వ్యక్తులు సమాచారం అందించారు. దీంతో అమల్‌రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇది వరకే ఓ హత్య కేసులో అమల్‌రాజ్ జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చి ఉన్నాడు. అయితే ఈబాలుడ్ని హతమార్చాల్సిన అవసరం అతడికి ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment