భర్త, కుమారుడే హతమార్చారు | Son And Husband Killed Mother In YSR Kadapa | Sakshi
Sakshi News home page

భర్త, కుమారుడే హతమార్చారు

Published Wed, Dec 5 2018 11:40 AM | Last Updated on Wed, Dec 5 2018 11:40 AM

Son And Husband Killed Mother In YSR Kadapa - Sakshi

మృతిచెందిన రమాదేవి(పైల్‌)

వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసింది.. తన తల్లి పరాయి మగాడితో ఉండడాన్నికుమారుడు జీర్ణించుకోలేక పోయాడు.. తప్పు చేస్తున్నావు అమ్మా అంటూ పలు సార్లు ఆమెను మందలించాడు.. ఇలా చేస్తే బంధువుల మధ్య పరువు పోతుందని నచ్చజెప్పాడు.. ఇవన్నీ వద్దమ్మా మన ఊరికి వెళ్దాం.. పదమ్మా అంటూ ప్రాధేయ పడ్డాడు.. అయినా తల్లి మనసు మారలేదు. కన్నప్రేమనుకాదనుకుంది.. పరాయివాడి ప్రేమే కావాలనుకుంది.. ఫలితంగా కన్న కొడుకు, భర్త చేతిలోనే ఆమె బలైంది.

ప్రొద్దుటూరు క్రైం : గత నెల 29న అనుమానాస్పద స్థితిలో పట్టణంలోని గౌరమ్మకట్టవీధిలో నివాసం ఉంటున్న రైల్వే టీసీ దేవరకొండ రమాదేవి మృతి చెందింది. ఈ సంఘనటపై అదే రోజు టూ టౌన్‌ పోలీస్‌స్టేష్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైంది. ఆమె మృతిపై అనుమానం రావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. రమాదేవిని ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమారుడు నిఖిల్, మామ మునుస్వామి, అతని స్నేహితుడు రామచంద్ర హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరిని టూ టౌన్‌ పోలీసులు మంగళవారం రైల్వేస్టేషన్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు సాయంత్రం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దేవరకొండ లక్ష్మీనారాయణ రైల్వేశాఖలో టీసీగా పని చేస్తున్నాడు. అతనికి 1997లో గుంతకల్‌కు చెందిన రమాదేవితో వివాహం అయింది. రమాదేవి కూడా ధర్మవరంలో టీసీగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నిఖిల్‌ ఉన్నారు. నిఖిల్‌ బెంగళూరులో బీటెక్‌ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే లక్ష్మీనారాయణ తాగుడుకు బానిసయ్యాడు. అతనికి 2010లో ధర్మవరానికి బదిలీ అయింది. కొంత కాలానికి అదే ప్రాంతానికి చెందిన ఒక స్త్రీతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం రమాదేవికి తెలియడంతో అనంతపురంలోని త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. తర్వాత భార్యాభర్తలిద్దరూ రాజీ అయ్యారు. అయినా భర్తపై ఆమెకు అనుమానం పోలేదు. ఆస్తిలో తన భాగం రాసివ్వమని భర్తతో గొడవపడుతూ ఉండేది. మద్యానికి బానిస అయిన అతను 8 నెలల క్రితం బెంగుళూరులోని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. అదే సమయంలో రమాదేవికి ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కాపురాన్ని మార్చారు. గౌరమ్మకట్టవీధిలోని ఒక ఇంటిని బాడుగకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఇలా వారి మధ్య ఉన్న పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినిపిం చుకోలేదు. మందలించినా మారలేదు     
రమాదేవి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం భర్తతో పాటు కుమారుడికి తెలిసింది. దీంతో కుమారుడు నిఖిల్‌ పలుమార్లు ఫోన్‌ చేసి తల్లిని మందలించాడు. ఈ విషయం బంధువులకు తెలిస్తే తలెత్తుకొని తిరగలేమని ప్రవర్తన మార్చుకోవాలని బతిమలాడాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఇదే విషయాన్ని నిఖిల్‌ తండ్రితో చెప్పాడు. రెండు, మూడు సార్లు కుమారుడు ప్రొద్దుటూరుకు వచ్చాడు. తనతో పాటు ధర్మవరానికి రమ్మని చెప్పాడు. ఎక్కడికి వచ్చేది లేదని, ఇక్కడే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది.

ముందే పసిగట్టిన రమాదేవి
ఆమె మృతిపై టూ టౌన్‌ పోలీసులకు అనుమానం రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తిని విచారించారు. అయితే ఈ విచారణలో కొన్ని ఆసక్తి కరమైన విషయలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. తనను భర్త, కుటుంబ సభ్యులు హతమారుస్తారనే విషయాన్ని రమాదేవి ముందుగానే పసిగట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె ఫిర్యాదు పత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇంతలోనే వారి చేతిలో హత్యకు గురైంది.

సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
రమాదేవి మృతి చెందిన విషయం తెలిసిన మరుక్షణమే డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐ మల్లికార్జునగుప్త, ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సీసీ కెమెరాల ద్వారా నిందితులను పసిగట్టారు. వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ దిగారనే విషయాన్ని కమాండ్‌ కంట్రోల్‌లోని నిఘా కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగి వెంటనే వారిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ ఇబ్రహీం, సుధాకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులరెడ్డి, సుధాకర్, సునీల్, రాజశేఖర్, సుబ్బయ్య, జయచంద్రలను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్సు చేస్తానని చెప్పారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

కుటుంబం చిన్నాభిన్నం
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రమాదేవి మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తల్లి లేని పిల్లలయ్యారు. బీటెక్‌ చదువుతున్న కుమారుడు నిఖిల్‌ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంతేగాక సొంత తల్లిని చంపాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. వివాహేతర సంబం«ధాలు ఎంత వరకూ అయినా దారి తీస్తాయో రమాదేవి ఉదంతమే ఉదాహరణ అని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వివాహేతర సంబంధాల జోలికి వెళ్లరాదని ఆయన సూచించారు.

ప్రొద్దుటూరులో రెక్కీ.. గొంతు నులిమి హత్య
భర్త లక్ష్మీనారాయణ, కుమారుడు నిఖిల్, మామ మునిస్వామి, అతని స్నేహితుడు రామచంద్ర కలిసి గత నెల 27న ప్రొద్దుటూరుకు వచ్చి మైదుకూరు రోడ్డులోని ఓ లాడ్జీలో దిగారు. రమాదేవి ఉంటున్న వీధిలో రెండు రోజుల పాటు వారు రెక్కీ నిర్వహించారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిఖిల్‌ను రమాదేవి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో నిఖిల్‌ ఆమె ఇంట్లో ఉన్న సమయంలోనే 29న వేకువ జామున లక్ష్మీనారాయణ, మునుస్వామి, రామచంద్ర అక్కడికి వెళ్లారు. అప్పటికే నిఖిల్‌ తలుపు తెరిచి ఉండటంతో వారు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న రమాదేవిని నలుగురు కలిసి గొంతు నులిమి చంపేశారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో వాస్మోల్‌ పోసి అందరూ అక్కడి నుంచి Ððవెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement