హత్య చేసి బావిలో పూడ్చిన శ్రావణి మృతదేహాన్ని బయటకు తీపిస్తున్న పోలీసులు
బొమ్మలరామారం (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఆచూకీ తెలియకుండా పోయిన బాలిక దారుణ హత్యకు గురైంది. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని బొమ్మలరామారం మండల పరిధిలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహ, నాగమణిల కుమార్తె శ్రావణి (14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసింది. పదో తరగతికి వెళ్లనున్న శ్రావణికి పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ క్లాస్‌ల కోసమని ఐదు రోజులుగా హాజీపూర్‌నుంచి ఉదయం 7 గంటలకు శ్రావణిని కుటుంబ సభ్యులు బైక్‌పై బొమ్మలరామారం మండల కేంద్రం వరకు దిగబెట్టేవారు. క్లాస్‌ల నిర్వహణ 11 గంటల వరకు జరిగేది. అనంతరం శ్రావణి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట ప్రాంతంలో బొమ్మలరామారం మండల కేంద్రం వరకు ఆటోలో వచ్చి హాజీపూర్ వరకు ఎవరైనా గ్రామస్తులు కలిస్తే లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సెరినిటి మోడల్ స్కూల్‌కు వెళ్లిన శ్రావణి మధ్యాహ్నం 3 గంటలు దాటినా ఇంటికి చేరకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు, బంధువులతో కలసి వెతకడం ప్రారంభించారు. రాత్రయినా ఎలాంటి జాడ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
తొలుత స్కూల్ బ్యాగ్‌ను గుర్తించి..
శ్రావణి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజీపూర్ సమీపంలో పడావుబడిన బావిలో తొలుత బాలిక స్కూల్ బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వారు రంగంలోకి దిగారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, శుక్రవారం రాత్రి స్కూల్ బ్యాగు లభించిన పడావుబడిన బావి సమీపంలోని మరో బావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు గుర్తించారు.
పోలీసు వాహనంపై దాడి
స్కూల్ బ్యాగ్ లభించిన సమాచారం ఇచ్చినప్పటికీ పక్క బావిలోనే శ్రావణి మృతదేహం ఉన్న విషయాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలం చెందారని గ్రామస్తులు, మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రావణి హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపిస్తూ దాడికి దిగారు. దీంతోపాటు డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావును అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా డీసీపీ వాహనంపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. అధికారులు అదనపు పోలీసుల బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలసి బాలికను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బావి వద్ద మూడుబీరు సీసాలు లభించినట్లు వారు తెలిపారు. బావిలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని రాత్రి 11 గంటలకు వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment