
లంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ తండ్రి.. ఇన్‌సెట్‌లో రంజన్ డిసిల్వ
కొలంబో: శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్ డిసిల్వ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్ అక్కడిక్కడే మృతి చెందారు. తండ్రి మరణం నేపథ్యంలో వెస్టిండీస్ టూర్ నుంచి డిసిల్వ తప్పుకున్నాడు.
62 ఏళ్ల రంజన్ అలియాస్ మహథున్, దేహివాలా-మౌంట్ లావినియా మున్సిపల్ కౌన్సిలర్. జ్ఞానేంద్ర రోడు వద్ద రాత్రి 8గం.30ని. సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, ఇప్పటిదాకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారంటున్నారు.
తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్ టూర్‌కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరినీ తీసుకోబోతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్టు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ దిముత్ కరుణరత్నే విండీస్ టూర్‌కు దూరం అయ్యాడు. కాగా, జూన్ 6 నుంచి వెస్టిండీస్‌తో శ్రీలంక జట్టు మూడు టెస్టులు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment