
కమల(ఫైల్) ,చౌడాడ సత్యనారాయణ
శ్రీకాకుళం ,వీరఘట్టం: ప్రేమ జంట కథ చివరకు విషాదాంతంతో ముగిసింది. పెద్దలను ఎదురించలేక తమలో ఉన్న ప్రేమను చంపుకుని ఆదివారం విశాఖపట్నంలోని కైలాసగిరిపై మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్నాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ప్రియుడు చౌడాడ సత్యనారాయణ ఆదివారమే చనిపోగా ప్రియురాలు రౌతు కమల మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. ఆమె కుటుంబ సభ్యులు కమల కళ్లను కేజీహెచ్ వైద్యుల సమక్షంలో దానం చేశారు. ఆదివారం సత్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్వగ్రామం అడారులో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కమల మృతదేహానికి కేజీహెచ్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామం అడారులోనే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. అడారులో విషాదం అలముకుంది.