బైక్‌పై పరారవుతున్న నిందితులు
రాంగోపాల్‌పేట్: ఓ బంగారం షాపు నుంచి మరో దుకాణానికి నగదు తీసుకుని వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీకి పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో శ్రీనివాస వర్మ అనే వ్యక్తి రోహిత్ జ్యువెలర్స్ పేరుతో బంగారు నగలను ఆర్డర్‌పై తయారు చేసి షాపులకు అందజేసేవాడు. అతడి దుకాణానికి ఎదురుగానే అనిల్ అనే వ్యక్తి నవ్‌కార్ జూవెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే అనిల్ నుంచి శ్రీనివాసవర్మకు నగల తయారీకి సంబంధించి కొంత నగదు రావాల్సి ఉంది. దీనికితోడు మరి కొంత మొత్తాన్ని బదులు ఇవ్వాలని శ్రీనివాస వర్మ అతడిని కోరాడు. నగదు సిద్ధం చేసిన అనిల్, శ్రీనివాస వర్మకు సమాచారం అందించడంతో అతను షాపులో పనిచేసే రూపారామ్ అనే వ్యక్తిని నవ్‌కార్ జూవెలర్స్‌కు పంపించాడు. మంగళవారం రాత్రి 8గంటల ప్రాంతంలో రూపారామ్ రూ.30లక్షల నగదు తీసుకుని మొదటి అంతస్తు నుంచి కిందికి వస్తుండగా మెట్లపై గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి చేతిలో బ్యాగు లాక్కుని పరారయ్యాడు. అప్పటికే రోడ్డుపై ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సేపటికి తేరుకున్న రూపా రామ్ యజమానికి ఈ విషయం చెప్పడంతో అతను మహంకాళి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసుల అదుపులో అనుమానితులు
మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. రెండు షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది.
ప్రత్యేక బృందాలతో గాలింపు
చోరీపై సమాచారం అందడంతో ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. నిందితులు జనరల్‌బజార్ నుంచి కళాసిగూడ, మంజు థియేటర్ మీదుగా వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.
డీసీపీ పరిశీలన
బుధవారం ఉదయం ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ పేర్కొన్నారు.
తెలిసిన వారి పనేనా?
ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కదలికలు, దొంగతనం జరిగిన తీరును బట్టి తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బైక్‌పై బట్టర్ ఫ్లై బేకరి గల్లీ నుంచి బయటికి వచ్చి అక్కడే దాదాపు అరగంట పాటు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. అనంతరం వీరు మహంకాళి దేవాలయం ముందు నుంచి నవకార్ జ్యువెలరీ షాప్ వరకు వెళ్లారు. వారిలో ఒకరు బైక్‌పై కూర్చుని ఉండగా మరొకరు పైకి వెళ్లి మొదటి అంతస్తులో బయటి నుంచి చూసి కిందికి వచ్చాడు. ఆ తర్వాత రూపారామ్ నగదు తీసుకుని కిందకు దిగుతుండగా మెట్లపైనే అడ్డుకుని బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. డబ్బు ఏ సమయానికి, ఎవరు, ఎలా తీసుకుని వస్తారనేదానిపై నిందితులకు పక్కా సమాచారం ఉన్నందునే నేరుగా రూపారామ్‌ను అడ్డుకుని దోపిడీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే రూపారామ్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా అతను కేకలు వేయకపోవడంతో అతడి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతను గట్టిగా అరిస్తే ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ప్రజలు, వ్యాపారులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకునే అవకాశం ఉండేది. దీనికితోడు నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల క్రితమే చోరీకి గురైనట్లు పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. రెండు జ్యువెలరీ సంస్థల యజమానులు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటంతో పథకం ప్రకారమే దొంగతనానికి స్కెచ్ వేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment