అర్చకుడు మల్లికార్జున శర్మ
తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం) : అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్యలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించగా ఆయనను తప్పించేందుకు యత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కోరుకొండ మండలం కణుపూరులోని స్వయంభు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ అర్చకుడు మల్లికార్జున శర్మను తొలగించే యత్నాల్లో ఆయనను మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఆయన నివసించే ఇంటి తాళాలు పగలుకొట్టి, ఇంట్లోని సామాన్లను పంచాయతీకి తీసుకురావడంలో ఆ నాయకుడు కీలకమైన పాత్ర పోషించారు. శర్మ తన ఆత్మహత్యకు కారకులుగా పేర్కొన్న జాబితాలో ఆయన పేరున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి సత్యనారాయణశర్మ పోలీసులకు ఇచ్చిన లిస్టులో కూడా ఆ ప్రజాప్రతినిధి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసులో ఆయన పేరు కనీసం ప్రస్తావనకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాల్ డేటా పరిశీలిస్తే కొత్తసమాచారం
మృతుడి తండ్రి, ఆయనతో మాట్లాడిన వారి ఫోన్‌లోని కాల్‌లిస్టును పరిశీలిస్తే కొత్త సమాచారం లభ్యమవుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా శర్మతో సఖ్యతగా ఉంటున్నవారితో మాట్లాడితే కొత్త సమాచారం వస్తుందంటున్నారు.
అధికార పార్టీ నేతను తప్పించే యత్నాలు
అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్య కేసులో టీడీపీ నాయకుడు, ప్రజా ప్రతినిధిని తప్పించడం కోసం పై స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు నూతన పద్ధతులను అవలంబిస్తేనే నిజాలు బయటపడతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. శర్మను మానసికంగా క్షోభపెట్టిన, అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పడంలో కీలకపాత్ర పోషించిన వారిని పోలీసులు గుర్తించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment