అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా అమీన్‌సాహెబ్‌పేట కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. హైవే పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి విశాఖపట్నం వైపు వేగంగా వెళుతున్న వి.వి.వినాయక్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అమీన్‌సాహెబ్‌పేట కూడలి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి అదే మార్గంలో ముందు వెళుతున్న లారీని ఢీకొంది. సుమారు 50 అడుగుల ముందుకు వచ్చి డివైడర్‌ను ఢీకొని ఆగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన పసుపులేటి అనిత బస్సు నుంచి తూలి రోడ్డు మీద పడి తీవ్రంగా గాయపడింది.
బస్సులో ప్రయాణిస్తున్న పి.సుప్రియ, కె.పూర్ణిమ, సీహెచ్. త్రిమూర్తుల రాజు, బి.సంపత్‌కుమార్, పి.తిరుపతిరావు, జి.హరి, బి.సుధీర్, పి.కల్యాణ్, అయినంపూడి సత్యవతి గాయపడ్డారు. వీరిని 108 వాహనాల్లో హైవే పోలీసులు అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. సంక్రాంతి సెలవులకు బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగదు, సెల్‌ఫోన్ గల్లంతు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిత గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి స్నేహితురాలితో కలిసి బస్సులో వస్తోంది. ఆమె చేతితో పట్టుకున్న రూ.3,700 ఉన్న పర్సు, సెల్‌ఫోన్ ప్రమాదంలో గల్లంతయ్యాయి. గాలించినా దొరకలేదు. తమ గ్రామం పాతపట్నం చేరడానికి నగదు లేకపోవడంతో ఎలా ఇంటికి చేరాలో తెలియక ఆమె ఆందోళనకు గురైంది. తోటి ప్రయాణికుల సాయంతో గమ్యస్థానానికి చేరాల్సి వచ్చింది. మిగిలిన వారు కూడా ఏదోలా నానా యాతన పడి వారి ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సును అతి వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని హైవే పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment