స్వాధీనపర్చుకున్న ద్విచక్ర వాహనాలు, పట్టుబడిన చోరీ నిందితులతో పోలీసు అధికారులు
మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్. మరో ఇద్దరు బాలురు (మైనర్లు) ఈ నలుగురూ.. డిప్లొమా విద్యార్థులు. ‘బిడ్డల్లారా.. బాగా చదువుకోండర్రా..’ అని, తల్లిదండ్రులు ఖమ్మం పంపించారు. కానీ, వీరు ఏం చేశారో తెలుసా...? జల్సాలకు అలవాటుపడ్డారు. దొంగతనాలకు తెగబడ్డారు. పోలీసులకు చిక్కారు. తమ తల్లిదండ్రులు తల దించుకునేలా చేశారు.
ఖమ్మంక్రైం: ఖమ్మంలో డిప్లొమా చదువుతున్న నలుగురు విద్యార్థులు, జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం దొంగతనాలకు తెగబడ్డారు. చివరికి, పోలీసులకు చిక్కారు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్రావ్ వెల్లడించిన వివరాలు...
పాల్వంచ రూరల్ మండలం వీరునాయక్ తండాకు చెందిన మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్, మరో ఇద్దరు మైనర్లు ఖమ్మంలో డిప్లొమా చదువుతున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేయసాగారు.
ఖమ్మం టూటౌన్ పరిధిలో ఐదు, ఖమ్మం వన్ టౌన్ పరిధిలో రెండు, ఖమ్మం త్రీ టౌన్ పరిధిలో రెండు, ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వీటిని తక్కువ రేటుకు అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
రద్దీ ప్రాంతాలే టార్గెట్
రద్దీగా ఉన్న ప్రాంతాలనే వీరు లక్ష్యంగా ఎంచుకున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. పాల్వంచ నవభారత్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా చోరీ చేశారు.
ఇలా దొరికారు
అడిషనల్ డీసీపీ వెంకట్రావ్ ఆదేశాలతో టూటౌన్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ యల్లయ్య, సిబ్బంది కలిసి నిఘా పెట్టారు. ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళుతున్న సూర్యప్రకాష్, మహేంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో వ్యవహారం బయటపడింది.
వీరితోపాటు మరో ఇద్దరు మైనర్లను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.4.70లక్షలు ఉంటుందని అంచనా.
ఈ కేసులో పురోగతి సాధించిన సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ యల్లయ్య, ఏఎస్‌ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర నాయక్, బుచ్చయ్య నాయక్, కానిస్టేబుళ్లు రాజు నాయక్, సైదులు, భాస్కర్‌కు రివార్డులు అందించారు. సమావేశంలో సీఐలు వెంకన్నబాబు, నాగేంద్రచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment