సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుని చిత్రం
వర్గల్(గజ్వేల్) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.22 లక్షల నగదును లాక్కొని బైక్ మీద ఉడాయించిన ఘటన వర్గల్ మండలంలో కలకలం రేపింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ఇప్పటికే నగదుతో సహా నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గౌరారం ఎస్‌ఐ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. వర్గల్ ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టే పనిని రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నది.
ఈ కంపెనీకి సంబంధించి గజ్వేల్‌లో పనిచేస్తున్న ఏటీఎం ఆపరేటర్లు ప్రవీణ్, హరి శనివారం సాయంత్రం వర్గల్ ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు రూ. 22 లక్షల నగదుతో బైక్‌మీద గజ్వేల్ నుంచి వర్గల్‌కు వెళ్తున్నారు. జెర్కిన్, హెల్మెట్, చేతికి గ్లవుజ్ ధరించిన ఓ ఆగంతకుడు నల్ల రంగు పల్సర్ బైక్‌పై వీరిని వెంబడించాడు. వర్గల్ మండలం మక్త సమీపంలో వీరి చేతిలో నుంచి నగదుతో ఉన్న బ్యాగును లాక్కొని చౌదరిపల్లి చౌరస్తా మీదుగా సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వైపు ఉడాయించాడు.
వీరు తేరుకుని బైక్‌ను వెంబడించే ప్రయత్నంలో చౌదరిపలి చౌరస్తా వద్ద పడిపోయి గాయాలపాలయ్యారు. సంబంధిత కంపెనీ ఆపరేషన్ మేనేజర్ కె.జనార్దన్‌కు నగదు చోరీ విషయం తెలిసి గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బైక్ దొంగకు సంబంధించిన ఫుటేజీ చిత్రాలు రాజీవ్ రహదారి సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద, ముట్రాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద సీసీ కెమెరాలలో నమోదయ్యాయి.
దీంతో దొంగ గజ్వేల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులో పురోగతి సాధించినట్లు.. నగదుతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment