thief capture
-
రూ. 22 లక్షల దొంగ దొరికాడు..?
వర్గల్(గజ్వేల్) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.22 లక్షల నగదును లాక్కొని బైక్ మీద ఉడాయించిన ఘటన వర్గల్ మండలంలో కలకలం రేపింది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ఇప్పటికే నగదుతో సహా నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గౌరారం ఎస్ఐ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. వర్గల్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టే పనిని రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కంపెనీకి సంబంధించి గజ్వేల్‌లో పనిచేస్తున్న ఏటీఎం ఆపరేటర్లు ప్రవీణ్, హరి శనివారం సాయంత్రం వర్గల్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు రూ. 22 లక్షల నగదుతో బైక్‌మీద గజ్వేల్ నుంచి వర్గల్‌కు వెళ్తున్నారు. జెర్కిన్, హెల్మెట్, చేతికి గ్లవుజ్ ధరించిన ఓ ఆగంతకుడు నల్ల రంగు పల్సర్ బైక్‌పై వీరిని వెంబడించాడు. వర్గల్ మండలం మక్త సమీపంలో వీరి చేతిలో నుంచి నగదుతో ఉన్న బ్యాగును లాక్కొని చౌదరిపల్లి చౌరస్తా మీదుగా సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వైపు ఉడాయించాడు. వీరు తేరుకుని బైక్‌ను వెంబడించే ప్రయత్నంలో చౌదరిపలి చౌరస్తా వద్ద పడిపోయి గాయాలపాలయ్యారు. సంబంధిత కంపెనీ ఆపరేషన్ మేనేజర్ కె.జనార్దన్‌కు నగదు చోరీ విషయం తెలిసి గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బైక్ దొంగకు సంబంధించిన ఫుటేజీ చిత్రాలు రాజీవ్ రహదారి సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద, ముట్రాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. దీంతో దొంగ గజ్వేల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులో పురోగతి సాధించినట్లు.. నగదుతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించ లేదు. -
ఎట్టకేలకు గజదొంగ అరెస్ట్
ఖమ్మంక్రైం : తాళం వేసి ఉన్న ఇళ్లనే అతడు లక్ష్యంగా చేసుకొంటాడు. అంతే తన వద్ద ఉన్న వస్తువులతో చాకచక్యంగా తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటాడు. 6 నెలల పాటు దొంగతనాల జోలికి వెళ్లకుండా దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేస్తూ తిరుగుతాడు.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌తో పాటు హైదరాబాద్ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ గజ దొంగను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు రూ.12లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన మనిగండ్ల విజయ్‌కుమార్ కూలీపనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అక్కడ చింతల్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో జీవిస్తూ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకొన్నాడు. దీనికితోడు మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొన్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తాళం పగులగొట్టి చోరీలు చేసేవాడు. హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాల్లో 34 చోరీలు చేశాడు. వాటిలో 19 రాత్రి దొంగతనా లు, 13 పగటి దొంగతనాలు, 12 సాధారణ దొం గతనాలు చేసి జైలు శిక్ష సైతం అనుభవించాడు. ఖమ్మం వచ్చి.. కొత్తగూడెంలో బస్టాండ్ ఎదురుగా ఓ గది అద్దెకు తీసుకొని అక్కడ నుంచి ప్రతిరోజూ ఖమ్మం నగరానికి వచ్చి దొంగతనాలు చేసి వెళ్లిపోతూ ఉండేవాడు. ఒక్కఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఆరు, ఖమ్మం వన్‌టౌన్‌లో ఒకటి, ఖానా పురం హవేలిలో ఒకటి, సత్తుపల్లి, చుంచుపల్లి, కూసుమంచి, ఖమ్మం త్రీటౌన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలు చేశాడు. ఇలా చిక్కాడు.. వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నా వారికి దొరకకుండా చోరీలకు పాల్పడే వాడు. వేలిముద్రల ఆధారంగా విజయ్‌కుమార్ ను గుర్తించిన సీసీఎస్ పోలీçసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా వ్యవహారం బయటపడింది. అతని వద్ద రూ.12 లక్షల సొత్తు స్వాధీనం చేసుకొన్నారు. నెల గడువులోనే.. నెల గడువులోనే సీసీఎస్ పోలీసులు రెండు చోరీ కేసులను ఛేదించటం పట్ల సీపీతఫ్సీర్ ఇక్బాల్ సీసీఎస్ పోలీసులను అభినందించారు. గతంలో సీసీఎస్ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి సరైన గుర్తింపు లేదని విమర్శలు వినపడ్డాయి. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీ ఈశ్వరయ్య, సీఐ కరుణాకర్ తమ సిబ్బందితో టీమ్‌వర్క్ చేస్తూ గత నెల అంతర్ రాష్ట్ర దొంగ లను పట్టుకొన్న సీసీఎస్ పోలీసులు నెల తిరగకముందే మరో దొంగను పట్టుకోవడం విశేషం. సిబ్బందికి రివార్డులు.. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ సిబ్బంది సీఐ కరుణాకర్, ఏఎస్ఐ లింగయ్య, సిబ్బంది సాధిక్, డి. డానియల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్ రాజ్‌కుమార్, క్లూస్‌టీమ్ సిబ్బంది జమలయ్యకు సీపీ తఫ్సీర్ ఇగ్బాల్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీలు వెంకట్రావ్, ఈశ్వరయ్య సీఐలు వెంకన్నబాబు, రాజిరెడ్డి, రమేష్, ఎస్ఐ యల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
సిద్దిపేటటౌన్ : వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సోమవారం కమిషనరేట్‌లో నిందితుడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, గజ్వేల్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేసామన్నారు. స్పెషల్ టీం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంతో కొంత మంది ఫోటోలు సేకరించి వారికోసం గాలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వర్గల్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అంతర్రాష్ట్ర దొంగ అయిన బింగి మాధవరావు(55) పోలీసులను చూసి పారిపోబోయాడు. అది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఇతన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను గతంలో కామారెడ్డి, జహీరాబాద్, షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 25 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుడు అద్దెకు ఉంటున్న ఇంటిలో 22 తులాల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు లభ్యమయ్యాయి. అందులో ఒక కత్తి, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, మిరపపొడి పాకెట్ లభించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై ప్రసాద్, సిబ్బంది బాబు, హోంగార్డు విష్ణువర్దన్, సిట్ టీం యాదగిరి, రాంచంద్రారెడ్డి, ఉపేందర్, రామక్రిష్ణలను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు నగదు బహుమతి అందించారు. -
మామను నమ్మించేందుకే..
సూర్యాపేట క్రైం : సినిమాల్లో మామను నమ్మించేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తుంటారు.. అలాంటి ఘటనే రియల్ జీవితంలో చేశాడు ఓ వ్యక్తి. ఓ అల్లుడు మామను నమ్మించేందుకు ఇక్కడ పోలీసులకు సినిమా చూపించాడు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగతనానికి గురైన సూర్యాపేట రూరల్ సీఐ వినియోగిస్తున్న (టీఎస్09పీఏ1568) నంబరు గల వాహనం రికవరీ సమయంలో ఆసక్తి గల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో దొంగతనానికి గురైన సీఐ వాహనంతో పాటు నిందితులు తిరుపతి లింగరాజు, నీరుడు అశోక్‌లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. ఆదివారం పోలీసు వాహనంతో పాటు చోరీకి పాల్పడిన నిందితులు లింగరాజు, అశోక్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలో సీఐ ప్రవీణ్‌కుమార్ వినియోగిస్తున్న సుమో వాహనాన్ని సూర్యాపేటకు చెందిన తిరుపతి లింగరాజు సీఐ డ్రైవర్ సైదులుకు సీఐ స్టేషన్‌కు వెళ్లమంటున్నారంటూ సుమోను దొంగిలించాడు. ఖమ్మం జిల్లా చింత కాని మండలం జగన్నాథపురానికి చెందిన నీరుడు అశోక్‌ను ఎక్కించుకొని తీసుకెళ్లాడు. మునగాల మీదుగా కోదాడ నుంచి చింతకాని మండలంలోని జగన్నాథపురంలోని తన అత్తగారి గ్రామానికి వాహనాన్ని తీసుకెళ్లాడు. అయితే లింగరాజు గతంలో మున్సి పల్ కార్యాలయంలో పనిచేసేవారు. కొద్ది కాలం క్రితం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడంతో జల్సాలకు అలవాటు పడి తిరుగుతున్నాడు. వివాహ సమయంలో లింగరాజుకు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తానని మామ చెప్పి చేయించడం లేదు. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్న రాజు స్థలాన్ని అమ్ముకుంటాడేమోనని.. మామ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో.. తనకు పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్లో చెప్పాడు. మామను నమ్మించాలంటే ముందుగా.. ఏం చేయాలో పాలుపోక.. జిల్లా కేంద్రంలో సీఐ వాహనాన్ని దొంగిలించి నేరుగా అత్తగారి స్వగ్రామమైన జగన్నాథపురానికి తీసుకెళ్లి.. సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నానని చెప్పి..అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జగన్నాథపురం గ్రామం నుంచి సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోకి ప్రవేశించిన లింగరాజుతో పాటు వాహనాన్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే విధంగా ఇటీవలి కాలంలో లింగరాజు పోలీసు కానిస్టేబుల్‌నంటూ.. ఓ బైక్‌ను అడ్డగించి ఎలాంటి పత్రాలు లేవంటూ.. స్టేషన్‌కు వెళ్లాలంటూ.. బైక్‌ను దొంగిలించాడు. దొంగిలించిన బైక్‌ను పాలేరులో తాకట్టు పెట్టాడని.. దానిని కూడా రికవరీ చేశామని తెలిపారు. చోరీకి గురైన వాహనాన్ని సూర్యాపేటకు తీసుకువచ్చామని.. దానిని స్వాధీనం చేసుకుని.. నిందితులు లింగరాజు, నీరుడు అశోక్‌లపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శివశంకర్, ప్రవీణ్‌కుమార్, అఖిల్‌జమా, ఎస్ఐ జానకిరాములు, సిబ్బంది చనగాని వెంకన్నగౌడ్, గోదేషి కరుణాకర్, గొర్ల కృష్ణ, గురుస్వామి, జాఫర్, శ్రీనివాస్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మార్గమధ్యలో పోలీసునంటూ బెదిరింపు లింగరాజు కోదాడ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్ల నిర్వాహకులను బెదిరింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ బైక్‌పై వెళ్తున్న వారిని అడ్డగించి వారి వద్ద ఉన్న బీరు కాటన్లను స్వాధీనం చేసుకొని సుమోలో వేసుకునిపోయారు. అదే విధంగా మరికొన్ని చోట్ల పెద్ద మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడ్డారు. పోలీసులను అభినందించిన ఎస్పీ జాదవ్ జిల్లా కేంద్రంలో సీఐ వినియోగిస్తున్న వాహనం చోరీకి గురి కాగానే.. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే హోం గార్డు స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా ఉండి నాలుగు గంటల సమయంలోనే వాహనాన్ని స్వాధీనం చేసే విధంగా సహకరించినందుకు గాను ఎస్పీ జాదవ్ అభినందించారు. అదే విధంగా ఖమ్మం, కృష్ణా, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు. -
గుప్త నిధుల కోసమే హత్యలు
- రుష్యశృంగుని కొండపై జంట హత్యల కేసు ఛేదింపు - నలుగురి అరెస్టు - పోలీసులకు రివార్డులు శింగనమల : శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ ఈఎంఐతో పాటు సీసీ కెమెరాలు నిందితుల్ని పట్టించాయి. కేసులో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఇలా వివరించారు. బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బొగ్గు పవన్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, బాబ్జాన్, వి.రాజశేఖర్‌రెడ్డి స్నేహితులు. పవన్‌కుమార్ తండ్రి అదే గ్రామంలో పూజారి. పవన్‌కుమార్‌కు గుప్త నిధులపై ఆసక్తి ఉండేది. దీంతో పవన్‌కుమార్ తన స్నేహితులతో కలిసి గత నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై రుష్యశృంగుని కొండపైకి గుప్తనిధుల కోసం వెళ్లాడు. అయితే అప్పటికే బత్తలపల్లి మండలానికి చెందిన పూజారి పెద్దన్న, ఆయన మేనల్లుడు వీఆర్ఏ ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రి కొండపై ఉన్నారు. గుప్తనిధులు తీసేందుకు అనుకూలంగా లేకపోవడంతో కొండ దిగి వచ్చి తిరిగి రాత్రికి వెళ్లారు. అయినా వారు అక్కడే ఉండటంతో అక్కమ్మ బావి దగ్గర ఉన్న వెదురు కట్టెలు తీసుకొచ్చి పడుకున్న వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.1800, సెల్‌ఫోన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. 20 వతేదీ ఉదయం తీవ్రంగా గాయపడిన సావిత్రి శింగనమలకు వచ్చి గ్రామస్తులకు, ఎస్ఐ హమీద్‌ఖాన్‌కు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వారు కొండపైకి వెళ్లి పరిశీలించగా పూజారి పెద్దన్న మృతి చెంది ఉండటం, ఈశ్వరయ్యను అనంతపురంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం విధితమే. దొరికింది ఇలా .. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రకాలుగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ పనిచేయడంతో ఈఎంఐ నంబరు ఆధారంగా మొబైల్ వాడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతనికి మొబైల్ విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిందితులు బి.కొత్తపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. అలాగే లోలూరు క్రాస్‌వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల్లోనూ నిందితులు బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో హత్యలు చేసినట్లు బయటపడింది. పోలీసులకు రివార్డులు : ఈ కేసును ఛేదించిన ఎస్ఐ హమీఖాన్‌ను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది చౌదరి, షెక్షావలి, సురేంద్ర, స్పెషల్ పార్టీ పోలీసులు యాసర్‌అలీ, ప్రసన్నా, మారుతి, రమణకు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ హమీద్‌ఖాన్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.