వివరాలు వెల్లడిస్తున్న సీపీ జోయల్ డేవిస్, అధికారులు
సిద్దిపేటటౌన్ : వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సోమవారం కమిషనరేట్‌లో నిందితుడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, గజ్వేల్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేసామన్నారు.
స్పెషల్ టీం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంతో కొంత మంది ఫోటోలు సేకరించి వారికోసం గాలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వర్గల్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అంతర్రాష్ట్ర దొంగ అయిన బింగి మాధవరావు(55) పోలీసులను చూసి పారిపోబోయాడు.
అది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఇతన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను గతంలో కామారెడ్డి, జహీరాబాద్, షామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 25 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు సీపీ తెలిపారు.
నిందితుడు అద్దెకు ఉంటున్న ఇంటిలో 22 తులాల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు లభ్యమయ్యాయి.
అందులో ఒక కత్తి, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, మిరపపొడి పాకెట్ లభించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై ప్రసాద్, సిబ్బంది బాబు, హోంగార్డు విష్ణువర్దన్, సిట్ టీం యాదగిరి, రాంచంద్రారెడ్డి, ఉపేందర్, రామక్రిష్ణలను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు నగదు బహుమతి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment