
గుప్త నిధుల కోసమే హత్యలు
- రుష్యశృంగుని కొండపై జంట హత్యల కేసు ఛేదింపు
- నలుగురి అరెస్టు
- పోలీసులకు రివార్డులు
శింగనమల : శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ ఈఎంఐతో పాటు సీసీ కెమెరాలు నిందితుల్ని పట్టించాయి. కేసులో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఇలా వివరించారు.
బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బొగ్గు పవన్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, బాబ్‌జాన్, వి.రాజశేఖర్‌రెడ్డి స్నేహితులు. పవన్‌కుమార్ తండ్రి అదే గ్రామంలో పూజారి. పవన్‌కుమార్‌కు గుప్త నిధులపై ఆసక్తి ఉండేది. దీంతో పవన్‌కుమార్ తన స్నేహితులతో కలిసి గత నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై రుష్యశృంగుని కొండపైకి గుప్తనిధుల కోసం వెళ్లాడు. అయితే అప్పటికే బత్తలపల్లి మండలానికి చెందిన పూజారి పెద్దన్న, ఆయన మేనల్లుడు వీఆర్‌ఏ ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రి కొండపై ఉన్నారు.
గుప్తనిధులు తీసేందుకు అనుకూలంగా లేకపోవడంతో కొండ దిగి వచ్చి తిరిగి రాత్రికి వెళ్లారు. అయినా వారు అక్కడే ఉండటంతో అక్కమ్మ బావి దగ్గర ఉన్న వెదురు కట్టెలు తీసుకొచ్చి పడుకున్న వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.1800, సెల్‌ఫోన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. 20 వతేదీ ఉదయం తీవ్రంగా గాయపడిన సావిత్రి శింగనమలకు వచ్చి గ్రామస్తులకు, ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌కు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వారు కొండపైకి వెళ్లి పరిశీలించగా పూజారి పెద్దన్న మృతి చెంది ఉండటం, ఈశ్వరయ్యను అనంతపురంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం విధితమే.
దొరికింది ఇలా ..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రకాలుగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ పనిచేయడంతో ఈఎంఐ నంబరు ఆధారంగా మొబైల్ వాడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతనికి మొబైల్ విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిందితులు బి.కొత్తపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. అలాగే లోలూరు క్రాస్‌వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల్లోనూ నిందితులు బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో హత్యలు చేసినట్లు బయటపడింది.
పోలీసులకు రివార్డులు : ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ హమీఖాన్‌ను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది చౌదరి, షెక్షావలి, సురేంద్ర, స్పెషల్ పార్టీ పోలీసులు యాసర్‌అలీ, ప్రసన్నా, మారుతి, రమణకు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హమీద్‌ఖాన్, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.