సమావేశంలో దొంగల ముఠాను చూపిస్తున్న సీపీ శివకుమార్
సిద్దిపేటటౌన్: సిద్దిపేట జిల్లా పరిధిలోని ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో రద్దీ ఉన్న ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని దోపిడీ, చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మంగళవారం సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసిన దొంగల ముఠాను సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సీపీ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం రెండు సంవత్సరాలుగా 9 మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి సిద్దిపేట, కొమురవెల్లి, హుస్నాబాద్, చేర్యాల, గౌరారం, ధర్మపురి, జగిత్యాల ప్రాంతాలలో రద్దీగా ఉన్న సమయంలో బస్టాండ్‌లోని ప్రయాణీకులు బస్సు ఎక్కే సమయంలో పర్సులు, బ్యాగులు, నగలు, సెల్‌ఫోన్‌లు దొంగిలించడం అలవాటుగా చేసుకున్నారని తెలిపారు.
ఈ ముఠాలో ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ హతాఫ్ ప్రధాన నిందితుడని, ఇతనితో పాటు ఇందిరాల నగేష్(నిజామాబాద్), ఇందిరాల రేణుక(నిజామాబాద్), ఇందిరాల రాజేష్(నిజామాబాద్), తంబల నితిన్(కొత్తగూడెం), గండుబెరుగుల రాజేష్(నిజామాబాద్), గండుబెరుగుల పద్మ(నిజామాబాద్), కుడి రాజేష్ (సికింద్రాబాద్), మైలర్ బస్వరాజ్(తాండూరు)లు ముఠా సభ్యులుగా మారి జల్సాలు చేయడానికి అలవాటు పడి దొంగతనాలను మార్గంగా చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వీరు జిల్లాలో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. దొంగిలించిన డబ్బులతో ఖరీదైన కార్లు అద్దెకు తీసుకొని ప్రయాణిస్తూ జల్సాలు చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
ముఠాలోని మహ్మద్ హాతాఫ్‌పై వేములవాడలో ఒక కేసు, ఇందిరాల రాజేష్‌పై మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌లో 9 కేసులు, ఇందిరాల నగేష్‌పై నార్సింగ్, తుకారాంగేట్, వేములవాడలో 4 కేసులు, గండుబెరుగుల రాజేష్‌పై వేములవాడలో 2 కేసులు, కుడి రాజేష్‌పై మారేడ్‌పల్లి, గోపాల్‌పూర్, ఘట్‌కేసర్‌లలో 4 కేసులు, అంబాల నితీష్‌పై జగిత్యాల, ధర్మపురిలో కానిస్టేబుల్ కొట్టి, పోలీసుల కస్టడీ నుంచి పారిపోయిన విషయంలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. సోమవారం చేర్యాల పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకొని విచారించగా మొత్తం వివరాలు వెళ్లడించారని తెలిపారు.
వరుస దొంగతనాలు...
వీరి నుంచి రూ.33,100 నగదు, మూడు కార్లు, 33 సెల్‌ఫోన్లు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఎల్‌ఈడీ టీవీ, పాత కరెన్సీ, 13 దేశాలకు చెందిన 25 కరెన్సీ నోట్లు ఉన్నాయని తెలిపారు. వీరిపై 100 కు పైగా పెద్ద నేరాలు చేసిన కేసులు, 400కు పైగా పిక్‌పాకెటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. వీరు పెద్ద ఎత్తున వరుస దొంగతనాలకు పాల్పడి ప్రజల్లో భయాందోళనలు కల్పించారని అన్నారు.
సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దళాలను ఈ మధ్యనే కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసుకున్నామని దీని వల్ల నిందితులను పట్టుకోవడంలో ఖచ్చితత్వం పెరిగిందన్నారు. లోకల్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సమన్వయంతో పనిచేసి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. టీ–కాప్‌లో భాగంగా పోలీసులకు ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీని వల్ల ఎక్కడిక్కడ నిందితుల వివరాలు, ఘటన వివరాలను ఈ–పెటీలో అప్‌లోడ్ చేయడం ద్వారా నిందితులను పట్టుకోవడం త్వరగా వీలవుతుందన్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు
సిబ్బందికి అభినందనలు..
నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, చేర్యాల సీఐ రఘు, ఎస్సై లక్ష్మణ్‌రావు, సీసీఎస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రివార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీసీఎస్ ఎస్‌ఐకి రివార్డు అందిస్తున్న సీపీ
Comments
Please login to add a commentAdd a comment