
చికిత్స పొందుతున్న వర్షిణి
జోగిపేట(అందోల్) మెదక్ : అందోలు మండలం దానంపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగిపేట నుంచి దానంపల్లి గ్రామానికి వెళుతూ రోడ్డుపై నిలిపి వేసిన టీవీఎస్ 50 ఎక్సెల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అది ఢీకొట్టడంతో టీవీఎస్ 50 ఎక్సెల్‌పై ఉన్న శ్రీనివాస్ (35) కాళ్లు విరిగిపోగా వర్షిణి (16), వెంకట్ (6)లకు తలకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు.
దీంతో 108 వాహనంలో ముగ్గురిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం శ్రీనివాస్, వర్షిణిలకు గాయాలు బాగా తగలడంతో సంగారెడ్డి ఆస్పత్రికి కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఢీకొట్టిన వాహనం గురించి అడిగినా సరైన సమాచారం తెలియలేదు.
అదే ప్రదేశంలో అక్కడక్కడా నంబరు ప్లేటు ముక్కలను గమనించి వాటినన్నింటిని ఒకచోటికి చేర్చారు. ఢీకొట్టిన కారు నంబరును టీఎస్09 వీఏ 0712గా పోలీసులు గుర్తించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నంబరు ప్లేటు ముక్కలను గమనించిన ఎస్‌ఐని స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment