సాక్షి నాలెడ్జ్ సెంటర్: దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.4,500 కోట్ల మేర అప్పులు చేసి, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎల్‌ఓయూల పేరిట రూ.11,400 కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేసిన నీరవ్ దీపక్ మోదీ.. అమెరికాలో తలదాచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ కూడా ఆయన విలాసాలకు కొదవేం లేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన హోటల్లో రోజుకు రూ.75 వేల అద్దె ఉండే సూట్‌ను ఏకంగా 90 రోజుల పాటు బుక్ చేసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక శనివారం వెల్లడించింది. అంటే.. కేవలం మూడు నెలల అద్దె దాదాపు రూ.70 లక్షలు! ఇక భార్య అమీ, ముగ్గురు పిల్లలతో ఉంటారు కనక మిగతా ఖర్చుల్ని ఊహించలేం. అయినా ఖర్చెంతయితే ఏంటి చెప్పండి!! ఆయనకు రుణాలివ్వటానికి, ఎగ్గొడితే వాటిని ఎన్‌పీఏలుగా మార్చి మన నెత్తిన రుద్దటానికి మన బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయి కదా!
బెల్జియంలో పుట్టుక.. భారత్‌లో వ్యాపారం
అంతర్జాతీయ డైమండ్స్ కేంద్రం బెల్జియంలోని ఆంట్‌వర్ప్‌లో 1971లో పుట్టిన నీరవ్ మోదీ... అక్కడే పెరిగి పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. అపర కుబేరుల పిల్లలు వ్యాపార రహస్యాలు తెలుసుకునే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరినా... మధ్యలోనే చదువు ఆపేశాడు. భారత ఆర్థిక రాజధాని ముంబై చేరుకున్నాడు. అప్పటికే నీరవ్ మేనమామలు మెహుల్ చోక్సీ తదితరులు వజ్రాల వ్యాపారంలో ఉన్నారు. వారు గీతాంజలి జెమ్స్‌ను నడిపిస్తున్నారు. వారి వద్దే వజ్రాల వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాడు నీరవ్. తొమ్మిదేళ్లపాటు అక్కడే కొనసాగాడు.
దశ మార్చిన ఆమె చెవి రింగులు
మొదట్లో నీరవ్‌కు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లో మ్యూజిక్ (ఆర్కెస్ట్రా) కండక్టర్ కావాలనేది ఆయన కోరిక. హైఫై సంగీత సాధనాలపై మోజుతో రణంగా బాంగ్, ఒలూఫ్‌సన్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు పబ్లిసిటీ కూడా చేశాడు. అయితే అనుకోకుండా తన 37వ ఏట ఓ స్నేహితురాలి కోరిక మేరకు నీరవ్ ఆమె చెవి రింగుల్ని డిజైన్ చేశాడు. అవి తనకు నచ్చటంతో... నీరవ్ మోదీ బ్రాండ్ శకం మొదలైంది. అదే పేరుతో అత్యంత ఖరీదైన ఫ్యాషన్ వజ్రాభరణాల వ్యాపారంలోకి దిగాడు నీరవ్. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ పేరిట సొంత కంపెనీని ఏర్పాటు చేశాడు. 2009లో ఆరంభమైన ఆభరణాల డిజైనింగ్.. నీరవ్‌కు ఊహించని స్థాయిలో ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ప్రఖ్యాత నగల కంపెనీ ఫ్రెడరిక్ గోల్డ్‌మన్‌లో భారీ వాటాను కొనుగోలు చేయడం నీరవ్ వ్యాపారాన్ని కొత్త మలుపు తిప్పింది. తన కంపెనీకన్నా ఏడు రెట్లు పెద్దదైన గోల్డ్‌మన్ కొనుగోలుతో ఆ దేశంలోని జేసీ పెనీ, సియర్స్, వాల్‌మార్ట్‌లో నీరవ్ మోదీ బ్రాండ్ ఆభరణాల అమ్మకాలు ఆరంభమయ్యాయి.
హాంకాంగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతి!
లండన్ ప్రఖ్యాత వేలం సంస్థ క్రిస్టీస్ వేలం వస్తువుల కేటలాగ్ మొదటి పేజీలో నీరవ్ ఫొటోను ప్రచురించింది. ఈ అదృష్టం దక్కిన తొలి భారతీయుడు ఇతడే! ఆయన రూపొందించిన గోల్కొండ నెక్లెస్‌కు 2010లో హాంకాంగ్‌లో నిర్వహించిన ఈ వేలంలో దాదాపు 35 లక్షల డాలర్ల ధర పలికింది. 2012 అక్టోబర్‌లో మరో ప్రఖ్యాత వేలం సంస్థ సతబీజ్ హాంకాంగ్‌లోనే జరిపిన వేలంలో నీరవ్ డిజైన్ చేసిన రివియెరీ డైమండ్ నెక్లెస్ ఏకంగా 51 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. దీంతో మరుసటేడాదే (2013లో) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి నీరవ్ పేరు చేరింది. నీరవ్ మోదీ, ఎ.జఫే పేరుతో నీరవ్ ఆభరణాల బ్రాండ్లు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. ఈ రెండు బ్రాండ్లనూ వందేళ్ల చరిత్ర ఉన్న వాన్ క్లీఫ్, ఆర్పెల్స్, రిచ్‌మాంట్ ఎస్యేస్ కార్టియర్ వంటి ప్రఖ్యాత వజ్రాభరణాల బ్రాండ్లతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాడు నీరవ్. బ్రాండ్‌లేని ఆభరణాలను తయారు చేయించి అమెరికాలోని ఇతర కంపెనీలకు సరఫరా చేసేవాడు. ప్రముఖ హాలీవుడ్ తార కేట్ విన్‌స్లెట్... నీరవ్ రూపొందించిన డైమండ్ నెక్లెస్ ధరించి 2016 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది.
ట్రంప్ చేతుల మీదుగా న్యూయార్క్ షోరూం
2013లో భారత బిలియనీర్ల జాబితాలో చోటుతో నీరవ్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. 2015లో న్యూయార్క్ లోని మాడిసన్ అవెన్యూలో నీరవ్ డైమండ్స్ షోరూమ్‌ను అప్పటి రియల్ ఎసేŠట్‌ట్ వ్యాపారి, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించడంతో మోదీ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన విలాసవంత జీవితం అప్పట్నుంచే వెలుగులోకి వచ్చింది.
కళ్లు చెదిరే పార్టీలు
వ్యాపారవృద్ధి ప్రయత్నాల్లో భాగంగా అనేక ప్రపంచ నగరాల్లో నీరవ్ ఇచ్చిన అత్యంత ఖరీదైన విందుల గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. వాటి వివరాలన్నీ అగ్ర శ్రేణి పత్రికలు, మేగజీన్లలో వచ్చేవి. నీరవ్ మోదీ వజ్రాభరణాలకు ప్రియాంకా చోప్రా, రోసీ హటింగ్టన్ వైట్లీ, ఆండ్రియా దియాకొను వంటి అగ్రశేణి తారలు, మోడల్స్ ప్రచారకర్తలుగా ఉండటంతో ఆయన పార్టీలకు ఆహ్వానం అందటమే గొప్ప విషయంగా మారింది. కిందటి నవంబర్‌లో ముంబైలోని ఫోర్‌సీజన్స్ హోటల్‌లో నీరవ్ ఇచ్చిన విందు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే స్టార్ షెఫ్ మసీమో బొతూరా ఆధ్వర్యంలో ఈ పార్టీ అతి«థుల కోసం ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. ఇటలీకి చెందిన బొతూరా సొంత రెస్టారెంట్ మోడెనా ఇటీవల ప్రపంచంలోనే 50 అత్యుత్తమ రెస్టారెంట్లలో ఒకటిగా ఎన్నికైంది. అక్కడ సీటును మూడు నెలల ముందే రిజర్వు చేసుకోవాలంటే ఆయనకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
మోడల్ లీసా కోసం ప్రత్యేక విందు!
తన బ్రాండ్ అంబాసిడర్లకు అట్టహాసంగా విందులు, విలువైన బహుమతులు ఇవ్వటం నీరవ్‌కు అలవాటే. టాప్ మోడల్, హాలీవుడ్ నటి లీసా హేడన్ కిందటేడాది మగబిడ్డను ప్రసవించిన కొన్ని నెలలకు ఆయన ఆమెకు పారిస్‌లో మంచి పార్టీ ఇచ్చారు. ఈ విందులో నీరవ్ డిజైన్ చేసిన పియర్ ఎమరాల్డ్ గొలుసును ధరించారు లీసా. అత్యంత ఖరీదైన బెంట్లీ కార్లలో తిరగడంతోపాటు ఇటాలియన్ సూట్లు ధరించడం ఈ వజ్రాల వ్యాపారికి చాలా ఇష్టం. ముంబై కాలా ఘోడా ప్రాంతంలో 70 ఏళ్లపాటు సాగిన మ్యూజిక్ స్టోర్ రిదమ్ హౌస్‌ను కిందటేడాది రూ.25 కోట్లకు కొనుగోలు చేసి కొత్త వజ్రాల షోరూం ప్రారంభించాడు నీరవ్.
2017 ఫోర్బ్స్ జాబితాలో...
నీరవ్‌కు 2017 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 1,234వ ర్యాంక్ లభించింది. భారత అపర కుబేరుల లిస్టులో ఈయనది 85వ స్థానం. వజ్రాభరణాల డిజైనింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జువెలరీ రిటైల్ వ్యాపారాల ద్వారా ఆయనకున్న ఆర్థిక సంపద రూ.లక్ష కోట్లపైనేనని అంచనా వేశారు. లండన్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో జరిగే ఆభరణాల ప్రదర్శనల్లో ప్రఖ్యాత అంతర్జాతీయ తారలు, మోడల్స్ నీరవ్ బ్రాండ్ నగలు ధరించి చేసిన క్యాట్‌వాక్‌లు అమ్మకాలు విపరీతంగా పెరగడానికి దోహదం చేశాయి.
బెంట్లీ కారు..ఇటాలియన్ సూటు
Published Sun, Feb 18 2018 4:34 AM | Last Updated on Sun, Feb 18 2018 4:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment