అమాయకురాలిపై యువకుల పైశాచికత్వం | Three People Molested A Women In Anantapur | Sakshi
Sakshi News home page

మహిళపై యువకులు పైశాచికత్వంతో..

Published Thu, Oct 3 2019 10:51 AM | Last Updated on Thu, Oct 3 2019 11:21 AM

Three People Molested A Women In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : మతిస్థిమితం లేని ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రోజుల తరబడి ఈ పైశాచికత్వం కొనసాగడంతో గర్భం దాల్చింది. విషయం బయటకు పొక్కడం.. నిందితులు టీడీపీ సానుభూతిపరులు కావడంతో గ్రామ పెద్దలు సర్దుబాటు చేశారు. చివరకు ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. కణేకల్లు మండలం పెనకలపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఉంటున్న ఓ మహిళకు మతిస్థిమితం లేదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిపించగా మతిస్థిమితం లేని మహిళ కావడంతో వదిలేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుని ఇంట్లో పాచి పని చేస్తూ జీవిస్తోంది. ఈమెపై కన్నేసిన ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు ఆమెపై నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

తెలుసుకోలేని అమాయకురాలు 
అమాయకురాలు కావడంతో ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఆమెలో మార్పును గమనించిన స్థానిక మహిళలు ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. ముగ్గురు యువకులు ఈ పైశాచికత్వానికి పాల్పడినట్లు తెలియడంతో పెద్ద మనుషులు రంగంలోకి దిగారు. బాధిత మహిళకు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. సమీప బంధువులు ఉన్నా డబ్బు ఎర వేశారు. అబార్షన్‌ చేయించి చేతులు దులుపుకోవాలని చూడగా.. అప్పటికే ఐదు నెలల గర్భం కావడంతో అలాగే వదిలేశారు. కాన్పు అయ్యాక ఆలోచిద్దామని అప్పటికి తొక్కిపెట్టారు. నవమాసాలు పూర్తయ్యాక హైరిస్కు కేసుగా తేలడంతో స్థానికులు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

తిలా పాపం తలా పిడికెడు 
నిందితులను కాపాడటంలో పెద్ద మనుషులే కాదు ప్రభుత్వ సిబ్బంది కూడా చేతులు కలిపారు. గ్రామంలో మతిస్థిమితం లేని మహిళ గర్భం దాల్చగా.. ఏడు నెలల నుంచి స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గ్రామంలో అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్యసిబ్బందికి తెలిసినా బయటకు చెప్పలేదని తెలుసుస్తోంది. ఆ గ్రామంలో టీడీపీ నాయకుల హవా కొనసాగుతుండటంతో బయటకు పొక్కకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. నాలుగురోజుల క్రితం అభాగ్యురాలికి నొప్పులు రావడంతో స్థానికులు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పసికందు పరిస్థితి, బాలింత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు జిల్లా మంగళవారం సర్వజనాసుపత్రికి రెఫర్‌ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఎస్‌ఎన్‌సీయూలో, తల్లి బాలింతల వార్డులో చికిత్స పొందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement