
సాక్షి, చెన్నై: తమిళనాడు చెన్నైలోని ప్రముఖ బంగారునగల దుకాణం వినియోగదారులకు భారీ టోకరా ఇచ్చింది. వివిధ స్కీంలలో పెట్టుబడుల పేరుతో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించి కోట్లాది రూపాయలను దండుకుంది. ఇటీవలి దీపావళి ఆఫర్ చెల్లించడంలో విఫలం కావడంతో అసలు గుట్టు రట్టయింది. షాపుల మూతకుదారితీసింది. మరోవైపు వేలాదిమందిని కోట్లాది రూపాయల మేర చీటింగ్ చేసినట్టు స్వయంగా దుకాణ యజమానే అంగీకరించారు.
వివరాల్లోకి వెళితే చెన్నైలోని నాతెల్లా సాంపత్తు చెట్టి( ఎన్‌ఎస్‌సీ)ఈ ఘరానా మోసానికి పాల్పడింది. స్కీముల పేరుతో 21వేలమంది కస్టమర్లకు రూ.75కోట్లకు కుచ్చు టోపీ పట్టింది. వివిధ నెలవారీ పథకాలలో డబ్బులు చెల్లించిన దాదాపు వెయ్యి మంది పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జ్యుయల్లరీ షాపు బండారం బయటపడింది.
ఈ నేపథ్యంలో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై ఆర్థిక నేరాల వింగ్ ( ఈఓడబ్ల్యు) అధికారులు కేసు నమోదు చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాథ గుప్తా సహా, ఐదుగురు డైరెక్టర్లు(కుమారులు ప్రభన్నకుమార్, ప్రసన్న కుమార్, గుప్తా బంధువు కోటా సురేష్) ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు తనిఖీలు నిర్వహించిన ఈఓడబ్ల్యు అధికారులు విలువైన ఆస్తి పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సంస్థకు చెందిన నగరంలో మెయిన్ సెంటర్‌లో షో రూంలు, రెండు ఇళ్లు, అంబత్తూర్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టించిన స్కూలు తదితర విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఆస్తులను చట్ట ప్రకారం విక్రయించి.. ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment