గుట్టు రట్టు | Treasure mining gang and workers arrested | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు

Published Sat, Oct 21 2017 1:17 PM | Last Updated on Sat, Oct 21 2017 1:23 PM

Treasure mining gang and workers arrested

నిందితులను చూపుతున్న జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు (తెల్ల చొక్కాలో ప్రధాన నిందితుడు రవీంద్రారెడ్డి, పక్కన వృత్తంలో దొంగ గురూజీలు ఉమామహేశ్వరరావు, రాయుడు)

ఒంగోలు క్రైం: దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామ పరిధిలోని గొంగటికొండ వద్ద గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు వెల్లడించారు.  స్థానిక ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్‌ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గుప్తనిధుల తవ్వకాల ముఠా వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు కనిగిరికి చెందిన సూరసాని రవీంద్రారెడ్డిని, అతని సోదరుడు సూరసాని లక్ష్మీ నరసారెడ్డి, విజయవాడకు చెందిన దొంగ గురూజీ ఉమామహేశ్వరరావు, రెండో దొంగ గురూజీ దొడ్డల ధర్మేంద్ర రాయుడులను రుద్రసముద్రం జంక్షన్‌ వద్ద అరెస్ట్‌ చేశామన్నారు.

వీరితో పాటు ఆర్థికంగా సహాయం చేసిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని మొత్తం కలుపుకొని 64 మందిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ వివరించారు. వీరివద్ద నుంచి తవ్వకాలకు ఉపయోగించిన 175 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్స్, 91 జిలెటిన్‌ స్టిక్స్, 15 కేజీల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు పలు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 50 మంది కూలీలతో కలిసి నెలల తరబడి 300 అడుగులు లోతున గొంగటి కొండలో సొరంగం తవ్వారని వివరించారు. పెద్ద ఎత్తున పేలుడు సామగ్రితో పాటు రెండో ఆటోలు, రెండు జనరేటర్లు, కంప్రెసర్‌ ట్రాక్టర్, మోటారు సైకిల్, 60 రకాల గిల్ట్‌ నగలు, అమ్మవారి విగ్రహాలు రెండు, గణేష్‌ విగ్రహం, కమండలం, నంది విగ్రహం, రెండు స్పటిక లింగాలు, నాగ పడగలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ముగ్గురు ఫైనాన్షియర్స్‌ కూడా అరెస్ట్‌..
గుప్త నిధుల తవ్వకాలకు సహకరించి సహకరించి పెట్టుబడి పెట్టిన ముగ్గురు ఫైనాన్షియర్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మారుబోయిన మాల్యాద్రి, దుబ్బకుటి మల్లికార్జున, దేరంగుల శ్రీనులు ఉన్నారు. అదేవిధంగా మార్కాపురానికి చెందిన

శ్రీనివాసులు, గోపాల్‌ అనే వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టారు. వీరంతా గుప్తనిధులు దొరికితే వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వారితో పాటు పేలుడు సామగ్రి సరఫరా చేసిన బండారు వెంకటాద్రి మార్కాపురానికి చెందిన షేక్‌ హనీఫ్‌ బాష, రుద్రపాటి అనీల్‌ కుమార్, బొచ్చు శ్రీనులుకూడా అరెస్ట్‌ అయిన వారిలో ఉన్నారు. మార్కాపురానికి చెందిన  గుప్తనిధుల తవ్వకాలు జరిపారని అప్పట్లో కూడా ఆ ముగ్గురే పెట్టుబడి పెట్టారన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.47 లక్షలు గొంగటికొండ తవ్వకాలకోసం ఖర్చుచేశారని, అందులో రూ.23 లక్షలు ఫైనాన్షియర్స్‌ పెట్టుబడి పెట్టగా మిగతా మొత్తం రూ.24 లక్షలు ప్రధాన నిందితుడు సూరసాని రవీంద్రారెడ్డి ఒక్కడే ఖర్చు పెట్టాడని పేర్కొన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి కూలీలు...
గొంగటి కొండ గుప్త నిధుల తవ్వకాలకోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 50 మంది కూలీలను పిలిపించారు. పొన్నూరుకు చెందిన రవీంద్ర రెడ్డి కూలీలను చెరుకుపల్లి, నగరం. పొన్నూరు మండలాల నుంచి రప్పించాడు. వెంకటరెడ్డి అనే వ్యక్తి నెల్లూరు, నంద్యాల, డోన్‌ ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురానికి చెందిన బత్తుల రాంబాబును తవ్వకాలకు మిషన్ల ఆపరేటర్‌ కమ్‌ డ్రైవర్‌గా వినియోగించుకున్నారు. ఇతనితోపాటు చిలకలూరిపేటకు చెందిన సూరసాని ఖాశింరెడ్డి, యద్దనపూడి మండలం పూనూరుకు చెందిన కోడిరెక్క బాబు, వరికుప్పల లింగమయ్య, డేరంగుల ఈశ్వరయ్య, బండి లక్ష్మీరెడ్డి, బండి సుబ్బారావు, బండి రామాంజ నేయులు రెడ్డిలు ఉన్నారన్నారు. వీరితో పాటు గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి, నగరం, పొన్నూరు, కర్నూలు, శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు, దోర్నాల, మార్కాపురం, రాచర్ల, మార్టూరు, పెద్దారవీడు, కంబం, నెల్లూరు జిల్లా కూవూరు, విడవలూరు ప్రాంతాల నుంచి కూడా కూలీలను గొంగటికొండకు రప్పించారన్నారు.

రూ.లక్షలు వచ్చే ఉద్యోగం వదిలి..
గుప్తనిధుల తవ్వకాలలో ప్రధాన నిందితుడు సూరసాని రవీంద్రా రెడ్డిది స్వగ్రామం కనిగిరి. ఇతను ఉత్తరాంచల్‌లో అగ్రికల్చరల్‌ ఎంబిఏ చదివాడు. స్టార్‌ ఆగ్రో కంపెనీలో ఇండియా మేనేజర్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ.30 లక్షలు జీతం సంపాదించేవాడు. ఉద్యోగాన్ని వదిలి కమోడిటీస్‌ ట్రేడింగ్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఈ వ్యాపారాల్లో  కోటి రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. తొందరగా డబ్బు సంపాయించాలన్న అత్యాశతో 2014 నుంచి విజయవాడలో ఉంటున్న దొంగ గురూజీ ఉమామహేశ్వరరావు మాయలో పడ్డాడు. గుప్త నిధుల కోసం రకరకాల పూజలు చేయించి ఆయన దాదాపు రూ.47 లక్షలు పోగొట్టుకున్నారు. ఉమామహేశ్వరరావు మాయలు నిజాలు కాదని తెలుసుకొని మరోదొంగ గురూజీ రాయుడుని ఆశ్రయించాడు. రాయుడు ద్వారా గొంగటికొండ, పులి కొండ గుహలో రాజుల కాలంనాటి విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, విగ్రహాలు మూడు పెట్టెల్లో తనకు కనిపించాయని చెప్పటంతో నమ్మి కూలీలు, సామగ్రితో అక్కడకు చేరుకున్నారు. తవ్వకాలు ప్రారంభించారు. ఇద్దరు దొంగ గురూజీలదీ మోసాలు చేయటమే పనిగా పెట్టుకొని ఎంతో మందితో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించి పూర్తిగా నష్ట పరచటమే వీరిపని అని వివరించారు.

రాళ్ల పరీక్ష కోసం అని నమ్మించి..
నెలల తరబడి కొండను తవ్వుతుంటే స్థానికులు నిలదీశరని, అయితే కొండను తవ్వటానికి అనుమతులు ఉన్నాయని, రాయిని పరీక్ష చేయించుకోవటానికి తవ్వుతున్నామని నమ్మించారు. మరోసారి వెలిగొండ టన్నెల్‌లో భాగంగా తవ్వుతున్నామని నమ్మబలికారు. నిజమేనని గ్రామస్థులు నమ్మారు. ఇడుపూరుకు చెందిన లక్ష్మీరెడ్డి గుప్త నిధుల ముఠా సబ్యులకు, కూలీలకు ఆశ్రయమిచ్చాడు. లక్ష్మీరెడ్డి కూడా గుప్తనిధుల బాధితుడే. దీంతో తన కుమారులతో ముఠా సభ్యులకు, కూలీలకు భోజనాలు సరఫరా చేయించాడు.
ఇతను గతంలో గుప్తనిధుల తవ్వకాలలో దాదాపు 20 ఎకరాలు పోగొట్టుకున్నాడు. అత్యాశతో ముఠాకు సహకరించి వచ్చిన గుప్త నిధుల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఏబీటీఎస్‌.ఉదయరాణి, మార్కాపురం ఓఎస్డీ లావణ్య లక్ష్మీ, దర్శి డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజులు పాల్గొన్నారు. మార్కాపురం ఓఎస్డీ లావణ్య లక్ష్మీ, దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, పొదిలి, దర్శి సీఐలు ఎం.శ్రీనివాసరావు రాఘవేంద్రరావు, దొనకొండ, మర్రిపూడి, కొనకనమిట్ల, మేదరమిట్ల, తాళ్ళూరు ఎస్‌ఐలు అజయ్‌బాబు, శ్రీహరి, బాలకృష్ణ, పాండురంగారావు, మహేష్, ఆర్‌ఎస్సై ప్రసాద్, ఎస్సై హుస్సేన్‌ బాష, సాంకేతిక సిబ్బందిని ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు.

దొంగ గురూజీతో డెమో.. – మోసగించే విధానాన్ని ప్రదర్శింప జేసిన ఎస్పీ
ఒంగోలు క్రైం: గొంగటికొండ గుప్త నిధుల తవ్వకాల విషయంలో నమ్మించి మోసం చేసిన దొంగ గురూజీల్లో విజయవాడలో స్థిరపడిన భీమవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ఒకరు. ఈయన లంకె బిందెలున్నాయని, నోట్ల కట్టలు పది రెట్లవుతాయని జనాన్ని ఎలా మోసం చేస్తాడో శుక్రవారం ప్రదర్శన ద్వారా చూపించారు. ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేక చొరవతో స్థానిక ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం కార్యాలయ ప్రాంగణంలోనే ఒక గుంట తవ్వించి మరీ గుప్తనిధులను తీసే విధానంలో నమ్మినవారిని ఎలా మోసం చేస్తాడో నిందితుడితోనే చేసి చూపించారు. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకున్న ఉమామహేశ్వరరావు తన ఇంట్లో దుర్గమ్మవారి పీఠం పెట్టి పూజలు చేస్తుంటాడు. ప్రజల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. లంకె బిందెలు ఎలా తీస్తాడో చూపించాడు.

అందరి ముందు గుంట తవ్వించి పూజలు, శాంతి పేరిట నిమ్మకాయలు కోయించి చాలా తతంగాలు చేస్తాడు. అందరినీ బయటకు పంపి పొట్టు సంచిలో పాత రాగి బిందెను తీసుకొచ్చి దానిని వారు బయటకు వెళ్లాక తరువాత దానిని ఆ గుంటలో పెట్టి దానిని పైకి వచ్చేట్టు చేస్తాడు. వచ్చిన దానిని ఆరు నెలలు తీయకూడదని, అరిష్టమని చెప్పి లక్షల్లో దండుకొని వెళ్లిపోతాడు. రూ.లక్ష అసలు నగదు పెట్టి రూ.10 లక్షలు అవుతుందని చెప్పి ఎంతో మందిని మోసం చేసిన విధానాన్ని కూడా ప్రదర్శింపజేశారు. ఇలా వేరు వేరు వ్యక్తులను దాదాపు రూ.3 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇంట్లో పూజలు చేసి ఆడవారికి అమ్మవారు వేషం వేయించి అమ్మవారు ప్రత్యక్ష అయ్యారని నమ్మించి, దిగంబర పూజలు కూడా చేసేవాడని వివరించారు. మరో గురూజీ ధర్మేంద్ర రాయుడుది స్వగ్రామం గుంటూరు జిల్లా పెద్దకూరపాడు గ్రామం.

చిన్నప్పుడు ఉత్తరాంచల్‌ వెళ్లిపోయి దాదాపు 40 సంవత్సరాలు అక్కడే ఉండి అనేక రకాల పూజలు నేర్చుకున్నానని చాలా మందిని నమ్మించాడు. విజయవాడకు వచ్చి ఒక విధవరాలిని వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. రవీంద్రారెడ్డికి గుప్త నిధుల అత్యాశ ఉందని గమనించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రాయుడుకు పరిచయం చేశాడు. దొనకొండ మండలంలోని పులి గుహలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయని రవీంద్రారెడ్డిని నమ్మించి పులికొండకు మూడు కొండలతో లింక్‌ ఉందని తనకు పూజలో కనిపించిందని నమ్మించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement