సాక్షి, నేరేడ్‌మెట్: రాజకీయ నాయకులు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకొని గ్యాంగ్‌స్టర్ల ముసుగులో బెదిరిస్తూ దోపిడీలకు యత్నించిన ముగ్గురు యువకులు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కారు. శనివారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు తెలిపారు.
► యాదాద్రి భువనగిరి జిల్లా మటూరుకు చెందిన సందెపల్లి క్రాంతికుమార్(23), సందెపల్లి సింహాద్రి(19) అన్నదమ్ములు. సోమరాజిగూడేనికి చెందిన సంగి జశ్వంత్(20) వీరి స్నేహితుడు.
► సింహాద్రి ఆన్‌లైన్‌లో నీటి సరఫరా కోసం మొబైల్‌యాప్‌ను రూపొందించాడు. క్రాంతికుమార్ సూచన మేరకు సింహాద్రి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బీర్లా ఐలయ్యను కలిసి పెట్టుబడి పెట్టాలని కోరాడు. అయితే ఆయన అంగీకరించలేదు. మరికొందరిని కూడా కలిసినా వారూ నిరాకరించారు. దీంతో ముగ్గురు కలిసి సులభంగా డబ్బులు సంపాందించాలని నిర్ణయించుకున్నారు. గ్యాంగ్‌స్టర్ల ముసుగులో బెదిరించి దోపిడీలు చేయాలని పధకం వేశారు.
► ఐలయ్యకు గ్యాంగ్‌స్టర్ ఖలీల్‌గా పరిచయం చేసుకొని రూ. 5కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని సింహాద్రి బెదిరించాడు. అయితే వారి పాచిక పారలేదు. తరువాత మహిళల పేరిట ఆకర్షించి దోచుకోవాలని భావించి శ్రీనివాస్ అనే వ్యక్తితో క్రాంతి చాటింగ్ చేశారు. రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై బాధితులు యాదగిరిట్టు, ఆలేరు ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు సరికొత్త మొబైల్ ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇతర అన్ని కోణాల్లో విచారణ చేసి నిందితులను గుర్తించారు. ఈ మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment