వంశీ కేసులో కొత్త కోణం | Turning Point In Vamshi Death Case In West Godavari | Sakshi
Sakshi News home page

వంశీ కేసులో కొత్త కోణం

Published Thu, Jul 25 2019 3:14 PM | Last Updated on Thu, Jul 25 2019 3:14 PM

Turning Point In Vamshi Death Case In West Godavari - Sakshi

వంశీ(ఫైల్‌), సెల్ఫీ వీడియో చూసి రోదిస్తున్న వంశీ తల్లి 

సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : ఇంజినీరింగ్‌ విద్యార్థి వంశీ హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. చనిపోయేముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనను చంపేందుకు ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు అందులో వంశీ పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపింది. వంశీది హత్యేనంటూ ఎప్పటి నుంచో బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ వంశీ తల్లిదండ్రులు కాళ్ళరిగేలా తిరిగారు. వంశీ సెల్‌ఫోన్‌లోని సెల్ఫీ వీడియోలు చూపించాలని పోలీసు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. సుమారు రెండేళ్ళ అనంతరం అతని సెల్ఫీ వీడియో మీడియా చేతికి వచ్చింది. ఈ రెండేళ్ళ పాటు పోలీసు అధికారులు, ఒక మాజీ ప్రజాప్రతినిధి కావాలనే కేసును ముందుకు కదలకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదవేగి మండలం లక్ష్మీపురానికి చెందిన వంశీని దారుణంగా హత్య  చేసినట్లు రుజువులు ఉన్నా ..ఈ కేసులో నిందితులు ఇప్పటి వరకూ దొరకలేదని పోలీసులు తమ రికార్డుల్లో పేర్కొనడం విమర్శలకు దారితీస్తోంది. 

అసలు వీడియోలో ఏముంది?
ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న వంశీ 2017 సెప్టెంబర్‌ 12న లక్ష్మీపురంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే తనను హత్య చేసేందుకు మాజీ టీడీపీ జెడ్పీటీసీ, మరో మహిళ కుట్ర చేశారనీ, వెంటాడుతున్నారనీ, తోటలోకి పారిపోయి వచ్చినని, తనను చంపేస్తారంటూ వంశీ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు బయటపడింది. తన కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యచేసి ఉరిగా చిత్రీకరించారని వంశీ తల్లిదండ్రులు ఆరోన్, చైతన్య కుమారిలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసుల ప్రాథమిక విచారణ జరిపి.. సెల్ఫీ వీడియోలో ప్రస్తావించిన వారికి వంశీ కుటుంబానికి మధ్య ఏమైనా వివాదం ఉందా? అని ఆరాతీశారు. ఆ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సైతం వంశీ కుటుంబసభ్యులు చెప్పారు.

అప్పట్లో వీడియో ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అరెస్టు చేయకుండా, ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి. అనుమానాస్పద మృతిని కొద్ది నెలల తరువాత సెక్షన్‌ 306గా మార్చారు. తన కుమారుడి మృతి వెనుక అప్పటి జడ్పీటీసీ, ఆయనకు సన్నిహితంగా ఉండే మహిళ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ కుమారుడి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో, మెసేజ్‌లను తమకు చూపించాలని పోలీసులను కోరినా, కోర్టు అధీనంలో ఉన్నందున ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్నదానిపై పోలీసుల వద్ద సమాధానం లేదు. గత ఎన్నికల్లో సదరు జెడ్పీటీసీ చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పనిచేసిన నేపథ్యంలో కావాలనే ఆ వీడియోలను బయటపెట్టారని, ఈ కేసుతో తమకు సంబంధం లేదని జెడ్పీటీసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాగా కేసులో నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పెదవేగి ఎస్సై బండి మోహనరావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement