
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయశ్రీ
బుల్లితెర నటి జయశ్రీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. స్థానిక తిరువాణ్మయూర్‌కు చెందిన భార్యాభర్తలు ఈశ్వర్, జయశ్రీ. ఇద్దరూ టీవీ నటులే. కాగా గత ఏడాదిన్నరగా వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో నటి జయశ్రీ ఆడయార్ పోలీస్‌స్టేషన్, చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త ఈశ్వర్‌కు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, కట్నం కావాలంటూ తనను రోజూ హింసిస్తున్నాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉంది.
కాగా ఇలాంటి పరిస్థితుల్లో నటి జయశ్రీ బుధవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం వండలూర్ ప్రాంతంలోని గుడిసెలు దగ్ధమయ్యాయి. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నటి జయశ్రీ, తిరిగి కారులో తిరువాణ్మయూర్ వెళ్తుండగా భర్త నుంచి ఫోన్ వచ్చింది. అతనితో మాట్లాడిన తరువాత ఒక మందుల దుకాణంలో నిద్ర మాత్రలు కొనుగోలు చేసి మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కారు నీలాంగరై సముద్ర తీరంలోకి రాగానే జయశ్రీ మైకంతో పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆమెకు సహాయంగా వచ్చిన వ్యక్తి వెంటనే జయశ్రీని నీలాంగరైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి నీలాంగరై పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment