
మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది, (ఇన్‌సెట్) అశోక్‌కుమార్ (ఫైల్)
వేలూరు: ఓ ప్రైవేట్ టీవీ కెమెరామెన్‌ను గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు శరవణ్‌పేట ఎన్‌ఎస్‌కే నగర్‌కు చెందిన అశోక్‌కుమార్(25) ప్రైవేట్ టీవీ చానెల్‌లో కెమెరామెన్ అవివాహితుడు. గురువారం రాత్రి అశోక్‌కుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 12.30 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తిరుమలై, రమేష్, అగస్టిన్ అశోక్‌కుమార్ ఇంటి తలుపులు తట్టారు. అశోక్‌కుమార్ తలుపులు తీసిన వెంటనే ఈ ముగ్గురు కత్తితో దారుణంగా పొడిచారు.
ఇది గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో నిందితులు ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని పెండ్‌ల్యాండ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలిసిన సౌత్ పోలీసులు నిందితులు తిరుమలై, రమేష్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అగస్టిన్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ముగ్గురూ ఎన్‌ఎస్‌కే నగర్‌లో తరచూ గంజాయి విక్రయించే వారని తెలిసింది. దీన్ని అశోక్‌కుమార్ పోలీసులకు చెప్పడంతో ఈ విషయం తెలిసిన ముగ్గురు నిందితులు అశోక్‌కుమార్‌ను హత్య చేసినట్లు పోలీసుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment