
దీపాకుమార్
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప నివాసంలో ఇటీవల నకిలీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. దీప నివాసంలో తనిఖీల పేరిట నకిలీ ఐటీ అధికారిగా వెళ్లిన వ్యక్తి తాజాగా పోలీసుల ముందు లొంగిపోయారు. దీప భర్త మాధవన్ ప్రోత్బలం మేరకే తాను నకిలీ ఐటీ దాడుల డ్రామాకు తెరలేపానని, దీపను భయపెట్టేందుకే తాము ఇలా చేసినట్టు అతను పేర్కొన్నట్టు తెలుస్తోంది.
దీప జయకుమార్ ఇంట్లో శనివారం ఉదయం ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహించారనే వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. పార్టీ పదవులను అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడలు జరిగినట్లు అందరూ భావించారు. అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ సంచలనం కలిగించింది. దాడి చేసింది అసలు ఐటీ అధికారులు కాదు. గ్యాంగ్ సినిమా తరహాలో నకిలీ ఇన్‌కం టాక్స్ అధికారులు ఈ దాడులకు యత్నించారని తేలింది.
ఐటీ దాడులకు వచ్చిన అధికారుల తీరుపై అనుమానం రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీప నివాసానికి చేరుకొనేలోపే నకిలీ ఐటీ గ్యాంగ్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. సినిమాలో మాదిరి పెద్ద ఎత్తున డబ్బు, వస్తువులను దోపిడీ చేయవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తుండగా.. తాజాగా లొంగిపోయిన నిందితుడు.. సంచలన విషయాలు తెలిపారు.